కరోనా వైరస్‌: కేరళలో కోలుకున్న విద్యార్థులు…

కొద్ది రోజులుగా ప్రపంచ దేశాలకు నిద్రపట్టకుండా చేస్తూ.. వేల సంఖ్యలో ప్రాణాలను బలిగొంటున్న వైరస్‌ కోవిద్-19(కరోనా వైరస్)‌. ఈ వైరస్‌ను కేరళ వైద్యులు జయించారు. చైనాలోని వుహాన్‌లో మెడిసిన్ చదువుతున్న ముగ్గురు విద్యార్థులు… ఇటీవలే భారత్ తిరిగొచ్చారు. ప్రాథమిక వైద్య పరీక్షల్లో వారికి కరోనా సోకినట్టు గుర్తించారు. దీంతో వారిని కేరళలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కరోనా వార్డులకు తరలించి… చికిత్స అందించారు. కేరళ వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన వైద్య నిపుణుల చికిత్స కారణంగా ముగ్గురు కరోనా బాధితులు పూర్తి స్వస్థత పొందారు. కొన్నిరోజుల చికిత్స అనంతరం వారిలో కరోనా వైరస్ లక్షణాలు పూర్తిగా తగ్గిపోయినట్టు గుర్తించారు. వైరస్‌ను జయించడంపై… కేరళ ప్రభుత్వ వర్గాలు, విద్యార్థుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. కోలుకున్న విద్యార్థులను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.

ఈ అంశంపై స్పందించిన కేరళ ఆరోగ్యశాఖ మంత్రి థామస్ ఐజాక్…. గతంలో నిపా వైరస్ ను జయించామని, ఇప్పుడు ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌పై పోరాటంలోనూ విజయం సాధించామని తెలిపారు. కాగా… ఈ మహమ్మారి కరోనా వైరస్‌ పంజాకు ఇప్పటికే చైనాలో దాదాపు 14 వందల మంది మృతి చెందారు. కరోనా వైరస్‌ బారినపడి వేలమంది ఆసుపత్రులపాలయ్యారు.