సీనియర్లకు కాంగ్రెస్‌ షాక్.. రాజ్యసభకు ప్రియాంక..?

ఈఏడాది రాజ్యసభలో భారీగా సీట్లు ఖాళీ అవుతున్నాయి. త్వరలో కాంగ్రెస్ సీనియర్ నేతల రాజ్యసభ పదవీకాలం ముగియబోతున్న నేపథ్యంలో మళ్లీ వారిని కంటిన్యూ చేయొద్దని కాంగ్రెస్ నిర్ణయించింది. వారి స్థానంలో జూనియర్లకు అవకాశం కల్పించాలని పార్టీ వ్యుహారచన చేస్తోంది. ప్లానులో భాగంగానే ప్రియాంక గాంధీని రాజ్యసభకు పంపాలని ఆ పార్టీ అధిష్ఠానం నిర్ణయించినట్లు సమాచారం.

రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉండగా, ఈ ఏడాది 68 సీట్లు వేకెంట్ అవుతాయి. అయితే, అవన్నీ గంపగుత్తగా ఒకేసారి ఖాళీ కావడంలేదు. ఏప్రిల్‌లో 51 మంది, జూన్‌లో ఐదుగురు, జులైలో ఒకరు, నవంబర్‌లో 11 మంది సభ్యుల పదవీ కాలం ముగుస్తుంది. ఇందులో 19 సీట్లు కాంగ్రెస్‌ పార్టీ కోల్పోతుంది. సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే ఆ పార్టీ కొన్ని సొంతంగానూ, ఇంకొన్ని మిత్రపక్షాల సహకారంతోనూ మహా అయితే… ఓ పది సీట్లు గెలుస్తుందేమో. ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ లలో కాంగ్రెస్ అధికారంలో ఉండటం ఆపార్టీకి కలిసొచ్చే అంశం. కర్ణాటక, తెలంగాణ, ఏపీ, మేఘాలయ, అసోం రాష్ట్రాల ప్రాతినిథ్యం ఉన్న రాజ్యసభ స్థానాల్లో కాంగ్రెస్‌కు మిగిలేది నిరాశే.

ఇక… అధికారం ఉన్న రాష్ట్రాల్లో కొందరికి మాత్రమే అవకాశం రానుందని తెలుస్తోంది. ఈసారి ప్రియాంక గాంధీ, జ్యోతిరాధిత్య సింథియా, రణ్‌ దీప్‌ సుర్జేవాలా వంటి నేతలను ఎగువ సభకు పంపే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్రల్లో ఆ పార్టీ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు అవకాశం ఉంది. ఈసారి ఎగువ సభకు సీనియర్లను కాకుండా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని పంపించాలనే… నిర్ణయానికి సోనియా వచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీ బలం 82 సీట్లు కాగా… ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014 నుంచి ఎగువ సభలో బీజేపీకి తగిన సంఖ్యా బలం లేదు. దీంతో బిల్లులను ఆమోదించుకోవాల్సిన సందర్భాల్లో ఇబ్బంది ఎదుర్కొంటోంది. ఇకపై విపక్షాల బలం తగ్గనుండడంతో ఎన్డీయేకు ఈసారి వెయిట్ పెరుగుతుంది. కాంగ్రెస్‌కు 46 మంది సభ్యులున్నారు. ముఖ్యంగా బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరాఖండ్‌లో ఒకటి, ఉత్తర్‌ ప్రదేశ్‌లో 10 స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకోనుంది. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో సైతం అభ్యర్థులను గెలిపించుకుని బలం పెంచుకోనుంది. ఐతే, మోదీ సర్కార్‌ను ఉభయ సభల్లో ఎదుర్కోవడానికి, పార్టీ శ్రేణుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికే కాంగ్రెస్‌ ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.