ముగిసిన సీఎం కేసీఆర్ కాళేశ్వరం పర్యటన…

లక్ష్మీ బ్యారేజ్ మీద నుంచి నాణాలు వదిలి మొక్కులు చెల్లించుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. వ్యూ పాయింట్ వద్ద ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. రాబోయే వర్షాకాలం వరద నీరు ఉధృతంగా చేరే అవకాశమున్న నేపథ్యంలో.. లక్ష్మీ బ్యారేజ్ నుంచి ఎప్పటికప్పుడు నీటిని తోడుకోవాలన్నారు. అందుకు సంబంధించిన వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని ఈఎన్‌సీలు మురళీధర్ రావు, నల్ల వెంకటేశ్వర్లు, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే సహా పలువురు ఇంజనీర్లు, ఉన్నతాధికారులకు సూచించారు. అటు, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేసి ఇటీవల ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా నూతన బాధ్యతలు స్వీకరించిన రజత్‌ కుమార్‌కు సంబంధిత విషయాల పట్ల అవగాహన పెరిగే విధంగా… ప్రాజెక్టు నిర్మాణము, సాగునీటి వినియోగం, ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు.

ప్రాజెక్టు సందర్శన సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… “ ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టులలోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుంటూ.. రిజర్వాయర్‌లను నింపాలి. గోదావరి జలాలను వృథా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంజనీర్లదే. ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి మొదలుకుని మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీలను రిజర్వాయర్లను ఎత్తిపోతల పంపులను కాల్వలను చివరాఖరికి ఆయకట్టు దాకా, సాగునీరు వ్యవసాయ భూములను తడిపే చివరి జల ప్రయాణం దాకా, సునిశిత పర్యవేక్షణ చేసుకోవాలి. ఎక్కడికక్కడ పని విభజన చేసుకుని, పూర్తి స్థాయిలో ఇంజనీరింగ్ వ్యవస్థను పటిష్ట పరుచుకోవాలి. అవసరమైతే పోలీసుల మాదిరి వైర్‌లెస్‌ వాకీటాకీ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని.. పని చేయాలి. సమాచారాన్ని ప్రతిక్షణం చేరవేసుకుంటూ ఎప్పుడు ఏ మోటార్‌ నడుస్తుంది.. ఏ పంపు పోస్తుంది… ఎన్ని నీళ్లు ఎత్తాలే, ఎప్పుడు ఆపాలే, ఎప్పుడు నీటిని కిందికి వదులాలే వంటి పలు విధాలైన నీటి పంపిణీ సాంకేతిక అంశాల పట్ల కాళేశ్వరం టీం మొత్తానికి అవగాహన ఉండాలి. అట్లా సమన్వయంతో పనిచేసి.. గోదావరి జలాలను నూటికి నూరుశాతం సద్వినియోగపరుచుకోగలం.“ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అందుకు సంబంధించి చర్యలు చేపట్టనున్నట్టు వివరించిన సీఎం.. మేడిగడ్డ వద్ద మధ్యాహ్నం భోజనం చేసి, కరీంనగర్‌కు బయల్దేరి వెళ్లారు.