వృద్ధ దివ్యాంగుడికి సీఎం కేసీఆర్ బాసట…

ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. దివ్యాంగుడైన ఓ వృద్ధుడి మొరను అత్యంత మానవత్వంతో ఆలకించిన సీఎం కేసీఆర్… సమస్యను పరిష్కరించారు. సీఎం కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లి వస్తుండగా… మార్గం మధ్యలో వికలాంగుడైన వృద్ధుడు చేతిలో దరఖాస్తుతో కనిపించారు. దీంతో కేసీఆర్ కారు దిగి ఆగారు. ఆయన దగ్గరికి వెళ్లి సమస్య అడిగి తెలుసుకున్నారు. తనకు తానుగా మహ్మద్ సలీమ్‌గా పరిచయడం చేసుకున్న అతడు, గతంలో డ్రైవర్‌గా పనిచేసేవాడినని, తొమ్మిదేళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నాని సీఎంకు చెప్పాడు. నాలుగేళ్ల క్రితం బిల్డింగ్‌ పైనుంచి పడడంతో కాలు విరిగిందని, తన కొడుకు ఆరోగ్యం కూడా బాగా లేదని, ఉండడడానికి ఇల్లు కూడా లేదని, తగిన సహాయం చేయాలని కోరాడు. దీనికి వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి… సలీమ్ సమస్యలను పరిష్కరించాలని, వికలాంగుల పెన్షన్ మంజూరు చేయాలని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయాలని హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతిని ఆదేశించారు.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టోలి చౌకిలో సలీమ్ నివాసముంటున్న ఇంటికి వెళ్లి కలెక్టర్ విచారణ జరిపారు. సలీమ్ వికలాంగుడని ధృవీకరిస్తూ సదరం సర్టిఫికెట్ ఉండడంతో.. అప్పటికప్పుడు పెన్షన్ మంజూరు చేశారు. జియాగూడలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేశారు. ప్రభుత్వ ఖర్చులతో సలీమ్‌కు వైద్య పరీక్షలు చేయించి, చికిత్స చేస్తామని హామీ ఇచ్చారు. కొడుకు కూడా అనారోగ్యంతో బాధపడుతుండడంతో సిఎంఆర్ఎఫ్ కింద ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు.