సీఎం స్థాయిలోనూ చిన్ననాటి స్నేహాన్ని మరువని కేసీఆర్…

సాధారణంగా ఒకస్థాయికి ఎదిగిన నాయకులకు చిన్నప్పటి దోస్తులు గుర్తుండరు. ఒకవేళ ఎక్కడైనా తారసపడ్డా ముఖం పక్కకు తిప్పుకుని వెళ్లిపోతారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం అందుకు అతీతం. తాజాగా, కరీంనగర్ లో వేలాదిమంది జనం మధ్య ముఖ్యమంత్రి తన స్నేహితుడిని గుర్తుపట్టి, దగ్గరకు పిలిపించుకున్నారు. తన దోస్తును అందరికీ పరిచయం చేస్తూ.. ఆనందంతో మురిసిపోయారు.

రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నా.. సీఎం కేసీఆర్ వ్యవహారశైలి ఇతర నాయకులకు భిన్నంగా ఉంటుంది. ఆయనలో సీఎం అన్న హంగూ, ఆర్భాటం కనిపించదు. ఎక్కడైనా తన చిన్ననాటి స్నేహితులు కనిపిస్తే చాలు… ముఖ్యమంత్రి వెంటనే వారిని అక్కున చేర్చుకుంటారు. వాళ్ల యోగక్షేమాలను తెలుసుకుని.. జాగ్రత్తలు చెబుతుంటారు. గతంలో ఎన్నో సార్లు ర్యాలీలు, సభలు, సమావేశాల్లో సీఎం కేసీఆర్ తన బాల్యమిత్రులను గుర్తుపట్టి దగ్గరకు పిలిపించుకున్న సంఘటనలున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ కరీంనగర్ పర్యటనలో అలాంటి ఘటనే మరోసారి జరిగింది.

హెలీప్యాడ్ నుంచి రోప్ పార్టీ సెక్యూరిటీ నడుమ.. కలెక్టరేట్ కు నడుచుకుంటూ వెళుతున్న సీఎం కేసీఆర్ కు సడన్ గా తన బాల్యమిత్రుడు కనిపించాడు. ఎన్నో ఏళ్ల తర్వాత కనిపించిన ఆ దోస్తును ఆయన వెంటనే గుర్తుపట్టారు. అంతమందిలోనూ తన స్నేహితుడిని పేరు పెట్టి పిలిచారు. ఏయ్ సంపత్‌ ఇట్రా అని దగ్గరకు పిలిపించుకున్నారు. సాక్షాత్తూ సీఎం కేసీఆరే ఇన్నేళ్ల తర్వాత కూడా తనను గుర్తుపట్టడం.. అందులోనూ తనను పేరు పెట్టి పిలవడంతో ఇదంతా కలయా, నిజమా అని సంపత్‌ సందేహంలో పడిపోయారు. సీఎం కేసీఆరే తనను పలకరించేసరికి కాసేపు ఆయన నోట మాట రాలేదు. రావడానికి తటపటాయిస్తుంటే ఆయన మా దోస్తయా.. జర రానీయండ్రి అని పోలీసులను ఆదేశించారు సీఎం కేసీఆర్. సంపత్‌ తో చేతులు కలిపి యోగక్షేమాలు తెలుసుకున్నారు. తనతో పాటు కలెక్టరేట్ సమావేశం వద్దకు తీసుకెళ్లారు.

ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా సీఎం కేసీఆర్ సింప్లిసిటీకి ఆయన చిన్ననాటి స్నేహితుడు సంపత్‌ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సీఎం కేసీఆర్ తో కలిసి నడుస్తూ ఆయన చిన్నపిల్లాడిలా మురిసిపోయారు. యావత్ ప్రపంచాన్నే జయించినంత ఆనందం సంపత్‌ లో కనిపించింది. ఏదేమైనా ఇలాంటివి సీఎం కేసీఆర్ కే సాధ్యం.