మా ఓటమిని అంగీకరిస్తున్నాం…

అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ప్రజలు ఇచ్చిన తీర్పును అంగీకరిస్తున్నామని తూర్పు ఢిల్లీ బీజేపీ ఎంపీ గౌతమ్‌ గౌతమ్‌ గంభీర్‌ అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ గెలుపు దిశగా దూసుకెళ్తున్న నేపథ్యంలో ఈ విషయంపై స్పందించిన బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతం గంభీర్… ‘ఢిల్లీ ఎన్నికల్లో ఓటమిని మేము అంగీకరిస్తున్నాం. ఢిల్లీ ప్రజలకు, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు శుభాకాంక్షలు. మేము మా శక్తిమేరకు పనిచేశాం. కానీ, ఢిల్లీ ప్రజల్లో నమ్మకం కలిగించలేకపోయామనుకుంటా. ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నేతృత్వంలో ఢిల్లీ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను’ అని గంభీర్ అన్నారు.

అలాగే.. ఢిల్లీ అసెంబ్లీ ఫలితాలపై స్పందించిన మరో ఎంపీ పర్వేశ్ వర్మ… ‘నేను ఈ ఫలితాలను అంగీకరిస్తున్నాను. తదుపరి ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం సమర్థవంతంగా పనిచేస్తాం’ అని తెలిపారు. ‘ప్రజల తీర్పు మాకు వ్యతిరేకంగా ఉంది.. దీన్ని మేము అంగీకరిస్తున్నాం. మా పార్టీని శక్తిమంతం చేసుకుంటాం’ అని కాంగ్రెస్ పార్టీ ప్రకటన చేసింది.

కాగా, మొత్తం 70 స్థానాల్లో ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో… ఆమ్ ఆద్మీ పార్టీ 09 స్థానాల్లో గెలుపొందగా మరో 54 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక, బీజేపీ ఆరు స్థానాల్లో గెలిచి, ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవలేకపోయింది.