భారత్‌కు క్షమాపణలు చెప్పిన బంగ్లాదేశ్‌ కెప్టెన్…

బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు చేష్టలకు ఆ జట్టు సారథి అక్బర్‌ క్షమాపణలు తెలిపాడు. ‘‘ఇలా జరగడం దురదృష్టకరం. మా బౌలర్లు కొందరు ఎక్కువగా ఉద్వేగానికి గురయ్యారు. అత్యుత్సాహం చూపారు. అయితే, వారు గతంలో జరిగిన ఆసియాకప్‌కు ప్రతీకారంగా దీనిని భావించారు. అందులో మేం ఫైనల్‌లో ఓటమిని చవిచూశాం. ఇప్పుడు విజయం సాధించే సరికి అలా చేశారు. ఏదీ ఏమైనా మర్యాదస్తుల ఆట అయిన క్రికెట్‌లో ప్రత్యర్థులకు గౌరవం ఇవ్వాలి. ఇలా జరగకూడదు. మా జట్టు తరఫున క్షమాపణలు చెబుతున్నా’’ అని అన్నాడు. ఈ విషయంపై భారత జట్టు యాజమాన్యం స్పందించింది. దీనిలో భారత కుర్రాళ్లు తప్పు ఏమాత్రం లేదని తెలిపింది. ఆదివారం జరిగిన అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్లో డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్‌పై బంగ్లాదేశ్ మూడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

అసలేం జరిగింది..?

ఆదివారం జరిగిన అండర్ 19వరల్డ్ కప్‌ ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు అతి చేశారు. దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌పై బంగ్లాదేశ్ విజయం సాధించింది. అయితే, కప్ గెలిచిన జట్టు ఓడిన ప్రత్యర్ధి జట్టుకు మ్యాచ్ అనంతరం అభివాదం తెలుపుతాయి. కానీ, బంగ్లా ఆటగాళ్లు హుందాతనం మరిచి పోయి గ్రౌండ్ ఇష్టం వచ్చినట్లు బిహేవ్ చేశారు. జెంటిల్ మ్యాన్ గేమ్‌లో హుందాతనాన్ని మరిచి బంగ్లాదేశ్ ఆటగాళ్లు టీమిండియా ఆటగాళ్లను గేలి చేస్తూ.. అసభ్యకరంగా ప్రవర్తించారు. మ్యాచ్ గెలిచిన అనంతరం బంగ్లా ఆటగాళ్లు భారత్ ఆటగాళ్లపై గొడవకు దిగారు. పేసర్‌ షోరిఫుల్‌ ఇస్లాం నోటికి పనిచెప్పాడు. మరో ఆటగాడు భారత్ ఆటగాళ్లను పక్కకి తోసేశాడు. బంగ్లా-భారత్ ఆటగాళ్ల గొడవపై అంపైర్‌ జోక్యం చేసుకొని ఇరు జట్ల మధ్య గొడవను సద్దు మణిగేలా చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

వాళ్లు అలా చేయకుండా ఉండాల్సింది…

ఫైనల్ మ్యాచ్‌ అనంతరం జరిగిన ఘటనపై భారత జట్టు కెప్టెన్ ప్రియమ్ గార్గ్ స్పందిస్తూ.. తమ జట్టు ఓటమిని స్వీకరించిందని, ఆటలో గెలవడం, ఓడిపోవడం చాలా సహజమని అభిప్రాయపడ్డాడు. అయితే, గెలుపు అనంతరం బంగ్లా ఆటగాళ్లు అతి చేయకుండా ఉండాల్సిందని చెప్పాడు. కాగా, జరిగిన ఘటనను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సైతం తీవ్రంగా పరిగణిస్తోంది. బంగ్లా యువ జట్టుపై తీసుకోవాల్సిన క్రమశిక్షణా చర్యలపై చర్చించే ముందు ఘటనకు సంబంధించిన ఫుటేజ్ ని తెప్పించుకుని పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా,, తాజాగా ఆ జట్టు కెప్టెన్ అక్బర్ క్షమాపణలు చెప్పాడు.