త్వరలో పెరగనున్న ఏటీఎం ఛార్జీలు…!

ఏటీఎంల నుంచి నగదు విత్‌డ్రా ఇకపై మరింత భారంగా మారనుంది. ఇంటర్‌చేంజ్ ఫీజులు పెంచాలంటూ ఆర్బీఐకి ఏటీఎం ఆపరేటర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి చేయడంతో ఇప్పుడీ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఏటీఎంల నిర్వహణ సంస్థలు నష్టాల్లో చిక్కుకుంటున్నాయనీ.. నగదు విత్‌డ్రాలపై విధించే ఇంటర్‌చేంజ్ ఫీజులను పెంచడం ద్వారా వాటిని ఆదుకోవాలంటూ ఏటీఎం అసోసియేషన్ ఆర్బీఐని కోరింది. ఆర్బీఐ ఇటీవల పెంచిన భద్రతా ప్రమాణాల కారణంగా ఏటీఎంల నిర్వహణ ఖర్చు మరింత పెరిగిందనీ.. దీన్ని అధిగమించాలంటే తమకు ఆదాయం సమకూరే విధంగా ఆర్బీఐ చర్యలు తీసుకోవాలని ఏటీఎం నిర్వహణ సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక బ్యాంకు కార్డును వేరే బ్యాంకు ఏటీఎంలో వినియోగించినప్పుడు ఆ ఏటీఎం ఆపరేటర్‌కు వినియోగదారులు ఇంటర్‌చేంజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఐదు పర్యాయాల వరకు ఉచితంగా విత్‌డ్రా చేసుకునే సదుపాయం ఆర్బీఐ కల్పించింది. ఆపై ప్రతి లావాదేవీకి రూ.15 వరకు ఏటీఎం ఆపరేటర్లు వసూలు చేస్తున్నాయి.