మోదీని ఆహ్వానించిన సీఎం కేజ్రీవాల్…

ఢిల్లీ సీఎంగా మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు అరవింద్ కేజ్రీవాల్. తన ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని మోదీని ఆహ్వానించారు సీఎం కేజ్రీవాల్. గురువారమే మోదీకి ఆహ్వానం పంపినట్లు ఆప్ వర్గాలు వెల్లడించాయి. అయితే కేజ్రీవాల్ ఆహ్వానంపై పీఎంవో కార్యాలయం ఇంకా స్పందించలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులెవర్నీ ఆహ్వానించడంలేదు. సీఎం కేజ్రీవాల్ తోపాటు కేబినెట్ మంత్రులు కూడా అదే రోజున ప్రమాణం చేయనున్నారు. ప్రజలే తమకు అతిథులని పార్టీ నేత గోపాల్ రాయ్ చెప్పారు. కాగా ఈనెల 16న ఉదయం 10 గంటలకు ఢిల్లీలోని చారిత్రక రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం జరగబోతుంది.