కంబళలో మరో రికార్డు… 9.51 సెకండ్లే!

కర్ణాటక సంప్రదాయ పోటీ కంబళ పోటీల్లో మరో రికార్డు నమోదైంది. జమైకా పరుగుల మిషన్ బోల్ట్ రికార్డును శ్రీనివాస గౌడ అనే వ్యక్తి బద్దలు కొట్టగా… వారం రోజులుగా సోషల్ మీడియా సహా ఇతర మాధ్యమాల్లో అతని పేరు మారుమోగిపోయింది. ఆ ఘనత గురించి అందరూ మాట్లాడుకుంటున్న తరుణంలోనే.. తాజాగా అదే కంబాళ పోటీల్లో మరో మెరుపు వీరుడు దూసుకొచ్చాడు. శ్రీనివాస గౌడ 9.55 సెకండ్ల రికార్డును తిరగరాస్తూ.. 9.52 సెకండ్లలో 100 మీటర్ల పరుగును పూర్తిచేశాడు. వేనూరు వేదికగా జరుగుతున్న కంబాళ పోటీలో కేవలం 13.68 సెకండ్లలో తన దున్నపోతులతో కలిసి 143 మీటర్ల మేర బురదలో పరుగెత్తి నిషాంత్‌ శెట్టి రికార్డు నమోదు చేశాడు. అంటే.. 100 మీటర్ల పరుగును కేవలం 9.51 సెకండ్లలో పూర్తిచేశాడన్న మాట. నిశాంత్ శెట్టి కర్ణాటకలోని బజగోళి జోగిబెట్ట ప్రాంతానికి చెందినవాడు.

గత వారం ఇదే కంబళ పోటీలో… శ్రీనివాస గౌడ అనే వ్యక్తి 142.5 మీటర్ల దూరాన్ని 13.62 సెకండ్ల పరిగెత్తడంపై సోషల్ మీడియాలో పెద్దెత్తున చర్చ జరిగింది. జమైకా పరుగుల వీరుడి రికార్డును బద్దలు కొట్టిన శ్రీనివాస గౌడకు.. భారత స్పోర్ట్స్‌ అథారిటీ నుంచి పిలుపు కూడా వచ్చిన విషయం తెలిసిందే. ఉసేన్ బోల్ట్ 9.58 సెకన్ల వరల్డ్ రికార్డతో పోల్చుకుని అచ్చెరువొందాం. కానీ, ఆ ఘనత గురించి అందరూ మాట్లాడుకుంటున్న తరుణంలోనే దాన్ని మించిన మరో అద్భుతం నమోదైంది.