ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి…

మార్చి 4 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మార్చి 4 నుంచి 18 వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్‌ తెలిపారు. ఉదయం 8.45 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,339 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసిన ఇంటర్ బోర్డు.. పర్యవేక్షణ కోసం ఒక్కో పరీక్షా కేంద్రానికి ఒక్కో చీప్ సూపరిండెంటెంట్‌ అధికారిని నియమించింది. మొత్తం 9 లక్షల 65 వేల 839 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానుండగా.. 25,550 మంది ఇన్విజిలేటర్లు పరీక్ష నిర్వహణలో పాల్గొననున్నారు. మొత్తం విద్యార్థుల్లో 4 లక్షల 80 వేల 516 మంది మొదటి సంవత్సరం పరీక్షలు రాయనుండగా… 4 లక్షల 85 వేల 323 మంది విద్యార్థులు రెండో సంవత్సరం పరీక్షకు హాజరుకానున్నారు. గురువారం నుంచి విద్యార్థులకు హాల్ టికెట్లు ఇంటర్‌ బోర్డు వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంటాయని విద్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామచంద్రన్ పేర్కొన్నారు.