ప్లే-స్టోర్‌ నుంచి 600 యాప్‌లు తొలగించిన గూగుల్‌…

అనుచిత ప్రకటనలతో వినియోగదారులకు చికాకు తెప్పిస్తున్న దాదాపు 600 యాప్‌లను గూగుల్‌ తమ ప్లే స్టోర్‌ నుంచి తొలగించింది. ప్రకటనల విషయంలో సదరు యాప్‌లు తమ విధానాలను ఉల్లంఘించినందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఎలక్ట్రానిక్‌ డివైజ్‌లను వినియోగిస్తున్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా, డివైజ్‌ పనితీరును దెబ్బతీసేలా, అనుకోని రీతిలో తెరపై ప్రకటనలను ఇస్తున్న యాప్‌లను తొలగిస్తున్నట్లు గూగుల్‌ తెలిపింది. ఇప్పటికే దాదాపు 4.5 బిలియన్ల సార్లు ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు సమాచారం. యాప్‌ని వినియోగించని సమయంలో, కాల్‌ చేస్తున్న సమయంలో కూడా ఇవి స్క్రీన్‌పై ప్రకటనల్ని చూపిస్తున్నట్లు గుర్తించారు. దీనివల్ల వినియోగదారుల విలువైన సమయం వృథా అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలోనే వీటిని యాప్‌ నుంచి తీసేశామన్నారు.

ఇప్పటికే సదరు యాప్‌ల ద్వారా ప్రకటనలు ఇచ్చిన కంపెనీలకు లేదా ఉత్పత్తులకు నిబంధనల ప్రకారం డబ్బులు తిరిగి చెల్లిస్తామని తెలిపారు. కేవలం డబ్బులు దండుకోవడమే లక్ష్యంగా సృష్టించిన ఇలాంటి మోసపూరిత యాప్‌లు చైనా, హాంకాంగ్‌, సింగపూర్‌, భారత్‌ కేంద్రంగానే పనిచేస్తున్నాయని గూగుల్‌ ఆరోపించింది. ఇంగ్లిష్‌ మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకొని వీటిని రూపొందిస్తున్నారని అభిప్రాయపడింది. ఏదైనా యాప్‌ను తొలగించేముందు దాని నిర్వాహకులకు తప్పును సరిదిద్దుకునేందుకు అవకాశం ఇస్తూ ముందుగానే నోటీసులు ఇస్తుందని గూగుల్‌ ప్రతినిధులు తెలిపారు. తొలగించిన వాటిలో చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ ‘చీతా మొబైల్‌’ యాప్ ఉన్నట్లు సమాచారం.