ముగిసిన వానకాలం పంట కొనుగోళ్లు…!

ఈ ఏడాది వానకాలం పంటల ధాన్యం కొనుగోళ్ల పక్రియ ముగిసింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పౌరససరఫరాల సంస్థ, ఇతర శాఖలతో సమన్వయం చేసుకుని కొనుగోళ్లను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రత్యేకంగా ధాన్యం కొనుగోళ్ల కోసం తొలిసారిగా రాష్ట్రస్థాయిలో ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ధాన్యం రవాణా, పర్యవేక్షణ, కనీస మద్దతు ధర అమలు, వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీలో వ్యవసాయ శాఖ కమిషనర్, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్, పోలీస్ అధికారి, సిడబ్ల్యూసీ రీజినల్ మేనేజర్, ఎస్డబ్ల్యూసీ ఎండీ, సెర్ఫ్ సీఈవో, ఎఫ్ సీఐజీఎం సభ్యులుగా ఉన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో అమలు చేస్తున్న రైతు సంక్షేమ చర్యలు, ముఖ్యంగా ప్రాజెక్టులు, 24 గంటల విద్యుత్, రైతుబంధు వంటి పథకాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగింది. దీంతో ఈ వానకాలంలో రికార్డుస్థాయిలో ధాన్యం దిగుబడి పెరిగింది. తెలంగాణ ఏర్పడిన 2014-15 నాటికి 14.15 లక్షల హెక్టార్లలో వరిని సాగు చేస్తుండగా.. 2018-19 నాటికి అది 24 లక్షల హెక్టార్లకు పెరిగింది. గతేడాది వానాకాలంలో 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరుగగా.., ఈ ఏడాది అదనంగా మరో ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు.

గతేడాది కంటే ఈ ఏడాది ధాన్యం కనీస మద్దతు ధర పెరిగింది. సాధారణ రకం ధర క్వింటాకు రూ. 1750 నుంచి 1815 రూపాయలు ఉండగా.. గ్రేడ్ ఏ రకం ధరను క్వింటాల్కు రూ. 1770 నుంచి 1835 రూపాయల వరకు పెంచారు. ధాన్యం విక్రయించే రైతులకు కనీస మద్దతు ధరను తప్పనిసరిగా అందిస్తూ కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. దీంతో అధికారులు 9.20 లక్షల మంది రైతుల నుంచి 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. రైతుల ఖాతాల్లో 8.625 కోట్లను జమ చేశారు. వానకాలం పంటల కొనుగోళ్లను పకడ్బందీగా పూర్తిచేసిన పౌరసరఫరాల శాఖ.. యాసంగి కొనుగోళ్లకు సిద్ధమవుతున్నది. ఏప్రిల్ మొదటి వారం నుంచి యాసంగి సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో అధికారులు ఇప్పటి నుంచే కార్యాచరణను రూపొందించే పనిలో పడ్డారు. గతేడాది యాసంగిలో 37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా.. ఈ ఏడాది 50 లక్షల మెట్రిక్ టన్నుల వరకు ఉత్పత్తి కావొచ్చునని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.