25 వేల మందితో ట్రంప్ కు స్వాగతం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పబ్లిసిటీని చాలా ఇష్టపడతారు..! యూఎస్ ప్రెసిడెంట్ గా ఎంత పాపులారిటీ వచ్చినా..ఇంకా ఏదో వెలతీ అన్నట్టు వ్యవహరిస్తారు. ఫిబ్రవరి 24న అహ్మదాబాద్ లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీతో కలిసి రోడ్ షో లో పాల్గొననున్నారు. ట్రంప్ రోడ్ షో కోసం పబ్లిసిటీ ఏర్పాట్లు భారీ స్థాయిలో సాగుతున్నాయి. అమెరికా నుంచి నేరుగా అహ్మదాబాద్ ఎయిర్ పోర్టులో కాలుమోపనున్నారు ట్రంప్. విమానాశ్రయం నుంచి మొతేరా స్టేడియం వరకు 22 కిలో మీటర్ల మేర ట్రంప్ రోడ్ షో జరుగనుంది. దారి పోడవున దాదాపు లక్షా 25 వేల మంది ట్రంప్ కు స్వాగతం పలుకనున్నారు. అయితే మూడు గంటలపాటు జరిగే ఈ పర్యటన కోసం కేంద్రం, గుజరాత్ ప్రభుత్వం భారీ ఎత్తున స్వాగత ఏర్పాట్లు చేస్తోంది. ట్రంప్ రోడ్ షోలో భాగంగా మధ్యలో సబర్మతి ఆశ్రమంలో ఇరవై నిమిషాల పాటు గడపనున్నారు. గాంధీ-కస్పూర్భా గడిపిన హృదయ కుంజ్ ను కూడా సందర్శించనున్నారు. గాంధీ జీవించినంత కాలం..కొన్ని వస్తువుల పట్ల అమితమైన మక్కువను కలిగి ఉండేవారు. వాటిల్లో ప్రముఖమైంది. రాట్నం..దానికి సంబంధించిన ఆనవాళ్లు ఇంకా కస్తూర్బా ఆశ్రమంలో ఉన్నాయి. ట్రంప్ పర్యటనలో భాగంగా..తన సతీమణి మెలేనియా ట్రంప్ తో కలిసి రాట్నం తిప్పనున్నారు. గాంధీ స్మృతులతో ఆశ్రమంలో ఉన్న..అలనాటి జ్ఞాపకాలకు సాక్ష్యంగా నిలిచిన వాటిని సందర్శించనున్నారు. చివరగా..సబర్మతి ఆశ్రమం నుంచి  పారుతున్న నదిని కూడా సందర్శించనున్నారు.

ట్రంప్ రోడ్ షో ఆసాంతం స్వాగత కార్యక్రమాలతో గ్రాండ్ గా సాగనుంది. 2014లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ కు చేసిన స్వాగత ఏర్పాట్లను మించి ట్రంప్ కోసం భారీ వెల్ కం..అరెంజ్ మెంట్స్ చేస్తున్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమైన వివిధ రాష్ట్రాల సంస్కృతులను ప్రతిబింబించేలా కల్చరల్ ప్రొగ్రామ్స్ నిర్వహించనున్నారు. రోడ్ షో జరిగే దారిలో ఏర్పాటు చేసిన సుమారు యాభై వేదికలపై ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కొనసాగనున్నాయి. నృత్య, గాన సంగీత విభావరీలతో ట్రంప్ కు గౌరవ సూచకంగా ఏర్పాటు చేస్తున్నారు. వీరితో పాటు…గుజరాత్ కు చెందిన గిరిజన కళాకారులు కూడా నృత్యాలతో ఆకట్టుకోనున్నారు. ఇదిలా ఉంటే..ట్రంప్-మోదీల చిత్రాలతో కూడిన 350 హోర్డింగ్స్ ను గుజరాత్ ప్రభుత్వం, అహ్మదాబాద్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దీని కోసం అహ్మదాబాద్ మున్సిపాలిటీ..3.8 కోట్లు ఖర్చు చేస్తుంది.

భారత పర్యటనను ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో విరివిగా వాడుకుంటున్నారు. ఇండియాలో తనకు స్వాగతం పలికేందుకు ఏడు మిలియన్ల ప్రజలు ఎదురు చూస్తున్నారంటూ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 55.7 లక్షల జనాభా ఉన్న అహ్మదాబాద్ లో 70 లక్షల మంది ఎలా స్వాగతం పలుకుతారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే కేవలం లక్ష నుంచి రెండు లక్షల మంది మాత్రమే హాజరవుతరంటూ అహ్మదాబాద్ నగరపాలక కమిషనర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మళ్లీ అలాంటి ప్రకటన చేయడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. మొత్తంగా అహ్మదాబాద్ లో అగ్రరాజ్యాధినేత ట్రంప్ కు మరచిపోని రీతిలో రోడ్ షో పొడవున భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.