సింప్లస్‌ కంపెనీని చేజిక్కించుకోబోతున్న ఇన్ఫోసిస్‌

ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మరో కీలక కొనుగోలుకు సిద్ధమవుతోంది. అమెరికా, ఆస్ట్రేలియా సహా మరికొన్ని దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న  సింప్లస్‌ కంపెనీని చేజిక్కించుకోబోతున్నట్లు ప్రకటించింది. ఈ కొనుగోలు ఒప్పందం విలువను 250 మిలియన్ డాలర్లుగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. దీంతో పాటు రానున్న మూడేళ్లలో కంపెనీ పనితీరును బట్టి ఉద్యోగులకు ప్రోత్సాహకాలు, రిటెన్షన్‌ పేమెంట్స్‌ కింద మరో 50 మిలియన్ డాలర్లు చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఈ కొనుగోలు ప్రక్రియ ఈ ఏడాది నాలుగో త్రైమాసికానికి పూర్తవుతుందని తెలిపింది. తమ వినియోగదారుల డిజిటల్‌ అవసరాలకు అనుగుణంగా కంపెనీని తీర్చిదిద్దేందుకు ఈ కొనుగోలు ఉపయోగపడుతుందని ఇన్ఫోసిస్‌ వెల్లడించింది.