లండన్‌లో ఓలా క్యాబ్‌ సేవలు ప్రారంభం

భారతీయ క్యాబ్‌ సర్వీసుల కంపెనీ ఓలా లండన్‌లో తన సేవలను మొదలుపెట్టింది. సోమవారం నుంచి లండన్‌లో ఓలా క్యాబ్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే అక్కడ 25 వేల మంది డ్రైవర్లు ఓలా ప్లాట్‌ ఫాంపై పనిచేసేందుకు రిజిస్టర్‌ చేసుకున్నారు. ఇక వీరికి ఇప్పటికే హై లెవల్‌ ఇంగ్లిష్‌ స్పీకింగ్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌లో శిక్షణ ఇచ్చామని ఓలా  తెలిపింది. దీంతో ప్రయాణికులు సులభంగా ఓలా క్యాబ్‌ సేవలను ఉపయోగించుకోవచ్చని ఆ కంపెనీ తెలియజేసింది. క్యాబ్‌ సేవల ప్రారంభం సందర్భంగా లండన్‌లోని కస్టమర్లు మొదటి వారం రోజుల పాటు 25 గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్లు అంటే దాదాపుగా  2 వేల 300 రూపాయల విలువైన వోచర్లను పొందవచ్చని ఓలా తెలిపింది. అలాగే మొదటి 6 వారాల పాటు తమ డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్‌ను తీసుకోబోమని ఓలా తెలిపింది.