ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఆయా రాష్ట్రాల ఇష్టం

ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు రాష్ర్టాల అభీష్టమని, కోటాకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పదోన్నతుల్లో కోటా పొందడం అనేది ప్రాథమిక హక్కు కాదని ఉత్తరాఖండ్‌ కేసులో తేల్చిచెప్పింది. రిజర్వేషన్లు కల్పించాలని తాము రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించలేమని స్పష్టంచేసింది. ఈ తీర్పుపై కాంగ్రెస్‌తోపాటు లోక్‌జనశక్తి పార్టీ అసంతృప్తి వ్యక్తంచేశాయి. ఇది రిజర్వేషన్ల స్ఫూర్తికే విరుద్ధమని వ్యాఖ్యానించాయి..

ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం 2012 సెప్టెంబర్‌ 5వ తేదీన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అయితే అందులో ప్రజా పనుల విభాగంలోని అసిస్టెంట్‌ ఇంజినీర్‌ పోస్టులకు సంబంధించి పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి రిజర్వేషన్‌ కల్పించరాదని నిర్ణయించింది. దీనిపై ఉత్తరాఖండ్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు కాగా, నియామకాలకు న్యాయస్థానం బ్రేక్‌ వేసింది. ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌లు ఎల్‌ నాగేశ్వర్‌రావు, హేమంత్‌ గుప్తాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రాష్ట్రాల ఇష్టమని  తీర్పు ఇచ్చింది.

ప్రభుత్వ ఉద్యోగుల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలవారు తగినంత సంఖ్యలో లేరని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే నియామకాలు, పదోన్నతుల్లో వారికి రిజర్వేషన్లు అమలుచేసే అధికారాన్ని ఆర్టికల్‌ 16(4), 14(4-ఏ) కట్టబెడుతున్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. అదేసమయంలో కచ్చితంగా కోటా అమలు చేయాలని ఎక్కడా పొందు పరుచలేదని తెలిపింది. ‘ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కోటా ఇవ్వాలని భావిస్తే.. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆయా వర్గాలకు తగిన ప్రాధాన్యం లేదని నిరూపించే సమాచారం సేకరించాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది.

అటు సుప్రీంకోర్టు తీర్పుపై కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీల హక్కులకు ముప్పు పొంచి ఉన్నదని ఆరోపించాయి. బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని విమర్శించారు. ఈ అంశంపై పార్లమెంట్‌ లోపల, బయట పోరాడుతామని ఆయా పార్టీల నేతలు చెప్పారు. నియామకాలు, పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని, ఇది రాజ్యాంగం కల్పించిన హక్కు అని గుర్తుచేశారు.