పెళ్లింట విషాదం

నిజామాబాద్‌ జిల్లాలోని బోధన్‌లోని వివాహ వేడుకలో విషాదం చోటుచేసుకుంది, శుక్రవారం రాత్రి అంతులేని ఆనందంలో మునిగిపోతు డాన్స్ చేసిన పెళ్లి కుమారుడు అనుకోకుండా గుండెపోటుతో మృతి చెందాడు. గణేశ్‌(25) అనే యువకుడికి నిన్న ఉదయం వివాహమైంది. వివాహ వేడుకలో భాగంగా రాత్రికి బరాత్‌ నిర్వహించారు. బరాత్‌లో డీజే పాటలకు వరుడు గణేశ్‌ తో పాటు పెళ్లి కుమార్తె కూడా స్టెప్పులేసింది. బరాత్ అంతా ఆనందోత్సాహాలతో సాగుతోంది. డ్యాన్స్‌ చేస్తుండగానే వరుడు కుప్పకూలిపోయాడు. అప్రమత్తమైన అతని తల్లిదండ్రులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 2 గంటల సమయంలో గణేశ్‌ కన్నుమూశాడు. గుండెపోటుతోనే వరుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గణేశ్‌ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. వధువు రోదన అందరినీ కలిచివేసింది.