పరవళ్లు తొక్కుతున్న కాళేశ్వరం గోదావరి జలాలు

తెలంగాణ జీవధార కాళేశ్వరంలో గోదావరి జలాలు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాజెక్టు లింక్‌-1, 2లో భాగంగా లక్ష్మి పంప్‌హౌజ్‌లో ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. అటు  సరస్వతి పంప్‌హౌజ్‌లో 5,6,7వ మోటర్లు, పార్వతి పంప్‌హౌజ్‌లో 3, 6, 7, 8వ మోటర్లు నిరంతరాయంగా నీటిని ఎత్తిపోస్తున్నాయి. లింక్‌-2లో భాగంగా నంది మేడారంలోని నంది పంప్‌హౌజ్‌లో 5,6 మోటర్లు నడుస్తున్నాయి. ఒక్కో మోటర్‌ ద్వారా 3 వేల 150 క్యూసెక్కుల చొప్పున 6 వేల 300 క్యూసెక్కులు నంది రిజర్వాయర్‌లోకి తరలుతున్నాయి. 7వ ప్యాకేజీలోని జంట సొరంగాల ద్వారా 8వ ప్యాకేజీలోని కరీంనగర్‌ జిల్లాలోని  లక్ష్మీపూర్‌ గాయత్రి పంప్‌హౌజ్‌కు వెళ్తున్నాయి. ఇక్కడా 2,3 పంపుల ద్వారా 6 వేల 300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నారు. ప్రస్తుతం గాయత్రి పంప్‌హౌజ్‌లో 7.95 టీఎంసీల జలాలను ఎత్తిపోసినట్టు అధికారులు తెలిపారు.

అటు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర జలాశయం ఎస్సారార్‌ నుంచి ఎల్‌ఎండీకి శనివారం 4 వేల 232 క్యూసెక్కుల నీటిని పంపించారు. ఎస్సారార్‌ జలాశయం రివర్స్‌ స్లూయిస్‌ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 24.989 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. మరోవైపు ఎస్సారార్‌ జలాశయం స్లూయిస్‌ గేట్ల నుంచి ఎల్‌ఎండీకి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. శనివారం 3 వేల 308 క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంలో రాగా.. 5 వేల 773 క్యూసెక్కుల అవుట్‌ ఫ్లో నమోదైంది. ఎల్‌ఎండీలో ప్రస్తుతం 11.059 టీఎంసీల నిల్వ ఉన్నది.అటు  ఎత్తిపోతల ప్రక్రియను ప్రాజెక్టు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు..

మరోవైపు ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా.. రాంపూర్‌, రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌజ్‌ల నుంచి కాళేశ్వర జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. రాంపూర్‌ పంప్‌హౌజ్‌లోని 7వ నంబర్‌ మోటర్‌ ద్వారా రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌజ్‌ ఎత్తిపోస్తున్నది. రాజేశ్వర్‌రావుపేట పంప్‌హౌజ్‌ నుంచి 3, 6వ మోటర్ల ద్వారా నీటిని తరలిస్తున్నారు.