ట్రంప్‌కు మురికివాడ కనిపించొద్దని అడ్డుగా గోడ

అమెరికా అధ్యక్షుడు పర్యటనకు వస్తున్నారంటే.. భద్రతపరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ఇక్కడి అభివృద్ధిని ఆయనకు చూపించే ప్రయత్నం చేయడం సహజం. అయితే గుజరాత్‌ ప్రభుత్వం మాత్రం తమ రాష్ట్రంలోని వెనకబాటును దాచుకునే ప్రయత్నం చేస్తోంది. త్వరలో భారత్‌కు వస్తున్న ట్రంప్‌.. గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి మురికివాడలు ఆయన కంట పడకుండా చేసేందుకు వాటికి అడ్డుగా గోడను నిర్మిస్తోంది.  అహ్మదాబాద్‌లోని  అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇందిరా బ్రిడ్జి వరకు రోడ్డు పక్కనుంచి అర కిలోమీటరు దూరం,  7 అడుగుల ఎత్తున గోడను నిర్మిస్తున్నారు. అయితే నగర సుందరీకరణలో భాగంగానే ఈ గోడను నిర్మిస్తున్నట్లు ఏఎంసీ అధికారులు చెబుతున్నారు. ఏఎంసీ చేపట్టిన ఈ చర్యను ప్రతిపక్ష కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శించింది. అభివృద్ధి చేయడానికి బదులు.. వెనకబాటును కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడింది.