జీఎస్టీ రాబడిలో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానం

దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులను, ఆర్థిక ప్రతిబంధకాలను అధిగమించి జీఎస్టీ  రాబడిలో తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకతను చాటుకొంటున్నది. పన్ను వసూళ్లలో భారీ లక్ష్యసాధనవైపు వడివడిగా అడుగులు వేస్తున్నది. ప్రత్యేక యాప్‌లు, స్పెషల్‌ డ్రైవ్‌లతో జీరో దందాను పూర్తిగా నిరోధించి ఇతర రాష్ర్టాలకు మార్గదర్శకంగా నిలుస్తున్నది. దేశంలో జీఎస్టీ వసూళ్లు తగ్గినా తెలంగాణలో మాత్రం రాబడి పెరిగింది. గత ఏడాది కంటే వృద్ధిరేటు తగ్గినప్పటికీ రాష్ట్ర వాణిజ్యపన్నులశాఖ అధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యల వల్ల లక్ష్యాన్ని మించి ఖజానాకు రాబడి చేకూరుతున్నది.

ప్రస్తుతం దక్షిణాదిలో జీఎస్టీ రాబడిలో మన రాష్ట్రమే అగ్రభాగాన నిలిచింది. 2019-20 వార్షిక బడ్జెట్‌లో వాణిజ్యపన్నులు, జీఎస్టీ ద్వారా రూ.47 వేల కోట్ల రాబడి వస్తుందని అంచనా వేయగా.. ఈసారి ఆ అంచనాను దాటే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వాస్తవానికి బడ్జెట్‌ అంచనాల్లో 80 నుంచి 90 శాతం సాధిస్తే దానినే గొప్ప విజయంగా భావిస్తారు. కానీ ఈసారి ఇప్పటికే రూ.40,268 కోట్లు వసూలయ్యాయి. ఇది మొత్తం లక్ష్యంలో 86 శాతంగా ఉండటం గమనార్హం. గతేడాదితో పోలిస్తే ఈసారి ఇప్పటికే 6.35 శాతం వృద్ధిరేటు నమోదయింది. గత ఆర్థిక సంవత్సరం 2018-19 ముగిసేనాటికి రూ.45,379 కోట్ల రాబడి వచ్చింది. దీంతో 15.37 శాతం వృద్ధిరేటు నమోదైంది. ఈసారి ప్రతికూల పరిస్థితులున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు ప్రత్యేక కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరినాటికి రూ.48 వేల కోట్ల నుంచి రూ. 50 వేల కోట్ల రాబడి సాధించాలన్న లక్ష్యంతో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొంటున్నారు.

ఇక వచ్చే 36 రోజుల్లో బకాయిలతోపాటు పన్నుల రూపంలో రూ.8 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల మేరకు వసూలు చేసేందుకు నిరంతర నిఘా కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రతి డివిజన్‌లో రెండు చొప్పున ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. ఇవి రెండు షిఫ్టుల్లో పనిచేస్తున్నాయి. మరోవైపు ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలను తనిఖీ చేసేందుకు 30 ప్రత్యేక బృందాలను నియమించారు. జీఎస్టీ బిల్లు చెల్లించకుండా సరుకులను రవాణా చేస్తున్న వాహనాలను పెద్ద సంఖ్యలో పట్టుకుంటున్నారు.

స్పెషల్‌డ్రైవ్‌లను నిరంతరం కొనసాగిస్తూ జీరో దందాకు పూర్తిగా చెక్‌ పెట్టగలిగారు అధికారులు. కేవలం వాహనాలను సీజ్‌ చేయడం ద్వారానే రూ.27 కోట్ల పన్ను రాబట్టారు. ఈ నెల 23 నాటికి స్టేట్‌ జీఎస్టీ, ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీతోపాటు మద్యం, పెట్రోల్‌పై వ్యాట్‌ కలిపి మొత్తం రూ.40,268 కోట్ల రాబడి వచ్చింది. ఇందులో కేవలం జీఎస్టీ ద్వారా రూ.20,618 కోట్లు, పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ ద్వారా రూ.7,720 కోట్లు, మద్యం అమ్మకాలపై వ్యాట్‌ ద్వారా రూ.7,980 కోట్లు వసూలయ్యాయి. గత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ, వ్యాట్‌ ద్వారా రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ. 45 వేల కోట్లు సమకూరాయి. దీంతో తెలంగాణ 15.5 శాతం వృద్ధిరేటు నమోదు చేసుకొని దేశంలో అగ్రభాగాన  నిలిచింది. కానీ ఈ సంవత్సరం వృద్ధిరేటు 13 శాతానికి తగ్గింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం పలురకాల వస్తు, సేవలపై జీఎస్టీ రేట్లను తగ్గించడంతో పాటు ఆర్థికమాంద్యం వల్ల రవాణా, సరుకుల కొనుగోలు తగ్గింది. వీటితోపాటు ఈసారి ఎక్కువ కాలంపాటు వర్షాలు కురవడం వల్ల పెట్రోల్‌పై వ్యాట్‌ కొంత తగ్గింది. ఈ కారణాల వల్ల వృద్ధిరేటు తగ్గినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా రాష్ట్రంలో జీఎస్టీ, వ్యాట్‌ రాబడులు భారీగా పెరుగుతున్నాయి

రాష్ట్రంలో గతేడాది వరకు జీఎస్టీ కింద 2.40 లక్షల మంది డీలర్లు, ట్రేడర్లు నమోదవగా.. ఇప్పుడు ఆ సంఖ్య 3.85 లక్షల వరకు పెరిగింది. వీరిలో 75 శాతం మంది స్టేట్‌ జీఎస్టీ పరిధిలో, 25 శాతం మంది కేంద్ర జీఎస్టీ పరిధిలో ఉంటారు. ఈసారి రాబడి రూ.50 వేల కోట్లు దాటాలని సీఎస్ సోమేష్ కుమార్ స్పష్టం చేయడంతో   ఉన్నతాధికారులు తదనుగుణంగా చర్యలు చేపడుతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎప్పటికప్పుడు స్పెషల్‌డ్రైవ్‌లను నిర్వహించడం ద్వారా పన్నుల ఎగవేతకు తావులేకుండా చూస్తున్నారు.