కేజ్రీ వాల్‌ ప్రమాణానికి ‘స్పెషల్  గెస్ట్’

ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు అరవింద్‌ కేజ్రీవాల్‌ సిద్ధమవుతున్నారు. ఈ నెల 16న చారిత్రక రామ్‌లీలా మైదానంలో అశేష జనవాహిని మధ్య కేజ్రీ ప్రమాణస్వీకారం జరగనుంది. అయితే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేక అతిథి రానున్నారట. ఎన్నికల ఫలితాల రోజున కేజ్రీవాల్‌ గెటప్‌లో కన్పించి తెగ వైరల్‌ అయిన  బేబీ మఫ్లర్‌మ్యాన్‌ను ప్రమాణస్వీకారానికి ఆహ్వానించినట్లు ఆమ్‌ ఆద్మీ పార్టీ తమ అధికారిక ట్విటర్‌ ఖాతాలో వెల్లడించింది.  ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ తిరుగులేని ఆధిక్యం కనబర్చగానే పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి చేరి సంబరాలు చేసుకున్నారు.  ఆ సమయంలో ఓ చిన్నారి అచ్చం కేజ్రీవాల్‌లా స్వెటర్‌ ధరించి, కళ్లద్దాలు, మీసం, టోపీ పెట్టుకుని, మెడలో మఫ్లర్‌ వేసుకుని ఆప్‌ ప్రధాన కార్యాలయం ముందు కన్పించాడు. ఈ చిన్నారి ఫొటోను ఆప్ తన ట్విటర్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది.   దీంతో ఆ చిన్నారి ఫొటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఆ చిన్నారిని అవ్యాన్‌ తోమర్‌గా గుర్తించారు. చిన్నారి తల్లిదండ్రులిద్దరూ ఆప్‌ మద్దతుదారులు.