ఉత్కంఠ పోరులో న్యూజిలాండ్‌ పై భారత్ విజయం

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. న్యూజిలాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో హర్మన్‌ ప్రీత్‌ సేన 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారత్‌ సెమీస్‌కు చేరడం ఖాయమైంది. 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్‌ ఆరు వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. చివర్లో అమెలియా కెర్ర్‌ 34 పరుగులతో  ధాటిగా ఆడినా కివీస్‌కు ఓటమి తప్పలేదు. 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఆ జట్టును.. మ్యాడీ 24 రన్స్, క్యాటీ 25 పరుగులతో ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 43 పరుగులు జోడించాక.. స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. కివీస్‌కు ఆఖరి ఓవర్‌లో 16 పరుగులు అవసరం కాగా శిఖా పాండే అద్భుతంగా బౌలింగ్‌ చేసి టీమ్‌ఇండియాను గెలపించింది. భారత బౌలర్లలో దీప్తి, శిఖా, రాజేశ్వరి, పూనమ్‌, రాధా తలా ఒక వికెట్‌ తీశారు.

అంతకుముందు టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. షెఫాలీవర్మ 46 పరుగులతో  ధాటిగా ఆడగా, తానియా భాటియా 23 పరుగులతో  ఫర్వాలేదనిపించింది. కివీస్‌ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో  ఓపెనర్‌ స్మృతి మంధాన 11, కెప్టెన్‌ హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌1, జెమిమా రోడ్రిగ్స్‌10, దీప్తి శర్మ 8, వేదా కృష్ణమూర్తి 6 పరుగులతో పూర్తిగా విఫలమయ్యారు. చివర్లో శిఖాపాండే 10, రాధా యాదవ్‌ 14 పరుగులు చేయడంతో..  న్యూజిలాండ్‌ ముందు 134 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో రోజ్‌ మేరీ, అమెలియా కెర్ర్‌ తలో రెండు వికెట్లు తీశారు. తాహుహు, సోఫీ డివైన్‌, కాస్పెరిక్‌ ఒక్కో వికెట్ తీశారు.