ఇరాక్‌లోనిఅమెరికా స్థావరంపై మరోసారి రాకెట్‌ దాడి

ఇరాక్‌లోని అమెరికా స్థావరంపై మరోసారి రాకెట్లు విరుచుకుపడ్డాయి.  కిర్కుక్‌ ప్రావిన్సులో అమెరికా బలగాలున్న కే1 స్థావరంపై కత్యుషా రాకెట్లతో దాడి జరిగినట్లు  స్థానిక మీడియా తెలిపింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం. ఈ దాడి అనంతరం  అమెరికా విమానాలు ఆ ప్రాంతంలో తక్కువ ఎత్తులో ఎగరడం అక్కడి స్థానికులు గమనించారని మీడియా సంస్థలు వెల్లడించాయి. గత డిసెంబర్‌ 27 తర్వాత ఈ స్థావరంపై దాడి జరగడం ఇదే తొలిసారి. అప్పట్లో వరుసగా 30 రాకెట్లు విరుచుకుపడడంతో అమెరికా ఉన్నతాధికారి ఒకరు మృతిచెందారు. దీనికి ఇరాన్‌ మద్దతున్న హెజ్బోల్లా తీవ్రవాద సంస్థనే కారణమని అమెరికా ఆరోపించింది. అనంతరం అమెరికా జరిపిన ప్రతీకార దాడిలో 25 మంది హెజ్బోల్లా తీవ్రవాదులు హతమయ్యారు.