ఆసియా రెజ్లింగ్‌లో భారత్‌కు స్వర్ణం

ఆసియా రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత మల్లయోధుడు సునీల్‌ కుమార్‌ సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. గ్రీకో రోమన్‌ 87 కేజీల విభాగంలో స్వర్ణం గెలిచిన సునీల్‌.. 27 ఏళ్ల తర్వాత ఈ కేటగిరిలో పసిడి గెలిచిన భారత రెజ్లర్‌గా నిలిచాడు. 1993లో చివరిగా పప్పూ యాదవ్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్‌లో స్వర్ణం గెలిచాడు. అటు ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో సునీల్‌ 5-0తో కిర్గిస్థాన్‌ రెజ్లర్ అజత్‌ చిత్తు చేశాడు. అంతకుముందు సెమీస్‌లో ఈ భారత రెజ్లర్‌ 11-8తో కజకిస్థాన్‌ రెజ్లర్ అజ్మత్‌ పై విజయం సాధించాడు. ఒక దశలో 1-8తో వెనకబడిన సునీల్ వరుసగా 11 పాయింట్లు సాధించి నెగ్గడం విశేషం. ఇదే టోర్నీలో మరో భారత రెజ్లర్‌ అర్జున్‌ 55 కేజీల విభాగంలో కాంస్యం గెలిచాడు.