మమతా లీడర్ కాదు, దయ్యం :బీజేపీ ఎమ్మెల్యే

సీఏఏ ఆందోళనల నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై… యూపీ బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ విమర్శలతో విరుచుకుపడ్డారు. సీఎం మమతా బెనర్జీని దయ్యంతో పోల్చుతూ వ్యాఖ్యలు చేశారు. మమతా బెనర్జీకి పూర్తిగా భూతం లక్షణాలున్నాయని, ఆమెకు విలువలు, మహిళా లక్షణాలు లేవంటూ తీవ్ర విమర్శలు చేశారు. వేలాది మంది హిందువులను చంపేసిన తీవ్రవాదులను మమతా రక్షిస్తున్నారని… కేవలం ఇలాంటి నేతలను మనం దెయ్యాలుగా పిలుస్తుంటామని ఎద్దేవాచేశారు. రాష్ట్రంలో మమతా బెనర్జీ లీడర్‌ కాదని.. శ్రీలంకకు లంకిణి అంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దేవతల పార్టీ అయితే.. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీలు రాక్షసజాతికి చెందినవని మండిపడ్డారు. అందుకే మమతా బెనర్జీని భూతంతో పోలుస్తున్నామని సురేంద్రసింగ్ చెప్పారు. అయితే… సీఏఏపై వెస్ట్ బెంగాల్ సీఎం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన ఇలా బదులిచ్చారు. కాగా.. పశ్చిమ బెంగాల్‌లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకున్నామని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని సురేంద్ర సింగ్ ధీమా వ్యక్తం చేశారు.