హైకోర్టుకెక్కిన ఉన్నావ్ అత్యాచార నిందితుడు…

యూపీలోని ఉన్నావ్ అత్యాచార నిందితుడు, బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన హైకోర్టులో సవాల్ చేశారు. అత్యాచారం కేసులో 2019 డిసెంబరు 20న కుల్దీప్ సింగ్ కు ట్రయల్ కోర్టు జీవితఖైదు శిక్షతో పాటు బాధితురాలి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహారం ఇవ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే.. తాజాగా ట్రయల్ కోర్టు తీర్పును నిలుపుదల చేయాలని కుల్దీప్ సింగ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా.. ఢిల్లీలోని తిస్ హజారీ కోర్టు ఇతనిపై వివిధ సెక్షన్ల కింద అభియోగాలను నమోదు చేసింది. 2017లో అప్పుడు మైనర్‌గా ఉన్న ఓ బాలికను కిడ్నాప్ చేసి ఆమెపై అత్యాచారం చేశాడని వచ్చిన ఆరోపణలతో సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడడమే కాకుండా.. కోర్టు విచారణకు వెళ్తుండగా ఆమె వాహనాన్ని ట్రక్కుతో ఢీకొట్టించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆ ఘటనలో బాధితురాలు, ఆమె న్యాయవాది ఇద్దరూ గాయపడగా.. ఇద్దరు మహిళలు మృతి చెందారు. బాధితురాలి తండ్రి మరణానికి సెంగార్ కారకుడయ్యాన్న అభియోగం కూడా ఇతనిపై ఉంది.