ఖేలో ఇండియా గేమ్స్‌లో తెలంగాణ పసిడి బోణీ…

ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌లో తెలంగాణ పసిడి బోణీ చేసింది. శనివారం జరిగిన అథ్లెటిక్స్‌ ఈవెంట్‌ అండర్‌–17 బాలికల లాంగ్‌జంప్‌ విభాగంలో తెలంగాణ అమ్మాయి అగసార నందిని స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన నందిని 5.65 మీటర్ల దూరం దూకి అగ్రస్థానాన్ని దక్కించు కుంది. నందిని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం విద్యార్థిని. నిర్మా అసారి (గుజరాత్‌–5.62 మీటర్లు) రజతం… అభిరామి (కేరళ–5.47 మీటర్లు) కాంస్యం సాధించారు. అండర్‌–17 బాలికల 400 మీటర్ల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి కుంజా రజిత రజత పతకం సాధించింది. రజిత 57.61 సెకన్లలో గమ్యానికి చేరింది.