పెరియార్‌ చుట్టూ తమిళ రాజకీయాలు…

తమిళనాడు పాలిటిక్స్‌ ఇప్పుడు ద్రవిడ ఉద్యమ నేత, ప్రముఖ సంఘ సంస్కర్త పెరియార్ చుట్టు తిరుగుతున్నాయి. పెరియార్‌ ర్యాలీపై రజినీకాంత్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ నిరసనలు కొనసాగుతుంటే..మరోవైపు గుర్తుతెలియని వ్యక్తులు విధ్వంసం సృష్టించారు. చెంగల్పేట్ జిల్లా కలియపట్టాయి గ్రామంలో పెరియార్‌ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. పెరియార్ విగ్రహం కుడిచేయి, ముఖం దెబ్బతినడంతో గ్రామస్థులు దిగ్భ్రాంతికి గురయ్యారు. స్థానికుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు..దుండగుల కోసం గాలిస్తున్నారు.

ఇటీవల చెన్నైలో జరిగిన తుగ్లక్ పత్రిక 50వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రజినీ… ద్రవిడ సిద్ధాంతకర్త పెరియార్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన రజినీ… 1971లో సేలంలో నిర్వహించిన ఓ ర్యాలీని గుర్తుచేశారు. అప్పట్లో పెరియార్‌ సీతా రాముల ప్రతిమలను నగ్నంగా తీసుకెళ్లారని రజనీ వ్యాఖ్యానించారు. ఇది అప్పట్లో బయటకు రాకుండా ప్రభుత్వం జాగ్రత్తపడిందని చెప్పుకొచ్చాడు. దీనిపై తమిళ సంఘాలు రజినీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆయన ఇంటి ముందు ఆందోళనలు కూడా చేపడుతున్నాయి. అయినప్పటికీ… రజినీ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చేప్పేది లేదని, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు.

ఇక తాజాగా ఈ విషయంపై ద్రావిడర్‌ విడుదలై కళగం నేతలు రజినీపై మండిపడుతున్నారు. తన వ్యాఖ్యలతో పెరియార్ గౌరవ ప్రతిష్ఠకు భంగం కలిగించారని రజినీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొళత్తూర్‌ మణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెరియార్‌ను కించపరిచిన రజనీకాంత్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.