సభ్యుల అనర్హత వేటుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు…

సభ్యుల అనర్హత వేటు అంశంలో స్పీకర్ అధికారలపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అనర్హత పిటిషన్లపై సభాపతి నిర్ణయాధికారంపై పార్లమెంట్ ఆలోచించాలి సూచించింది. స్పీకర్‌ కూడా ఓ పార్టీకి చెందన వారేనని… స్పీకర్‌కు అనర్హతా పిటిషన్లపై అధికారాలు ఎలా ఉండగలవని ధర్మాసనం ప్రశ్నించింది. తమ సూచనను పరిశీలంచాలని సుప్రీం ధర్మాసనం పార్లమెంట్‌ను కోరింది. ఎంపీలు, ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించిన పిటిషన్లపై నిర్ణయం తీసుకునే విచక్షణాధికారాలు కేవలం స్పీకర్‌కు మాత్రమే ఉండడానికి బదులుగా… ఒక స్వతంత్ర, శాశత వ్యవస్థను ఏర్పాటు చేయాలని పార్లమెంట్‌కు సూచించింది.

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచి… ఆ తర్వాత బీజేపీలో చేరి, ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న తౌనోజమ్ శ్యాంకుమార్‌ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. శ్యాంకుమార్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌కు పిటిషన్ సమర్పించగా నిర్ణయం తీసుకోవడంలో ఆయన జాప్యం వహించారు. దీనిపై ఆ ఎమ్మెల్యేలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ చర్యను తీవ్రంగా ఆక్షేపించిన హైకోర్టు.. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద ఎమ్మెల్యే అనర్హతపై నిర్ణయాధికారాలు తమకు లేవని వెల్లడించింది. దీంతో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సుప్రీం కోర్టును ఆశ్రయించగా… వారి పిటీషన్ ను ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఇవాళ విచారించింది. నాలుగు వారాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని మణిపూర్ స్పీకర్‌ను ఆదేశించింది. ఒకవేళ నిర్ణయం రాని పక్షంలో తిరిగి సుప్రీంకోర్టుకు రావొచ్చని ఆ ఎమ్మెల్యేలకు సూచించింది.

ఇక.. ఈ సందర్భంగా పార్లమెంట్‌కు కీలక సూచనలు చేసింది. అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ సుదీర్ఘ కాలం ఉండడానికి వీల్లేదని.. ఒక నిర్ణీత కాల వ్యవధిలో తన నిర్ణయాన్ని ప్రకటించాల్సిందేనని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై మూడు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.