నిర్భయ దోషి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం కోర్టు…

2012లో నిర్భయ అత్యాచారం, హత్య కేసు నలుగురు దోషుల్లో ఒకడైన పవన్‌ కుమార్‌ గుప్తా పిటిషన్‌ సుప్రీం కోర్టు కొట్టివేసింది. నిర్భయ ఘటన సమయంలో తాను మైనర్‌ అని పవన్‌ పిటిషన్‌ దాఖలు చేశాడు. ఘటన సమయంలో పవన్‌ మైనర్‌ అని, అతని స్కూల్‌ సర్టిఫికెట్‌లో కూడా అతడు మైనర్‌ అని చెప్పడానికి ఆధారాలున్నాయని దోషి తరపు న్యాయవాది ఏపీ సింగ్‌ కోర్టుకు తెలిపారు. ఢిల్లీ హైకోర్టు ఈ విషయాన్ని పరిగణించలేదని ఏపీ సింగ్‌ సుప్రీం కోర్టుకు వెల్లడించారు. ఐతే పవన్‌ గుప్తా మైనర్‌ కాదని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కాలయాపన కోసమే పిటిషన్‌ వేశారని కోర్టు పేర్కొంది. ఒకే అంశంపై మళ్లీ మళ్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయరాదని… పిటిషన్‌ విచారణకు అర్హత లేదని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. పవన్‌ గుప్తా తరఫు న్యాయవాదిని కోర్టు మందలించింది.

కాగా… ఇప్పటికే పవన్‌ కుమార్ పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు కొట్టివేసింది. నిర్భయ దోషులకు… అనేక మలుపుల తర్వాత రెండవ సారి డెత్‌ వారెంట్‌ జారీ చేసింది ఢిల్లీ కోర్టు. ఫిభ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు దోషులకు ఉరిశిక్ష అమలు పరచాల్సిందిగా డెత్‌ వారెంట్‌లో పేర్కొంది. ఉరిశిక్ష దగ్గర పడుతున్న కొద్దీ.. బయటపడేందుకు ఉన్న చివరి అవకాశాలను వినియోగించుకునేందుకు నిందితులు ప్రయత్నిస్తున్నారు.