రాజ్‌పథ్‌ వద్ద ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు…

భారత 71వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో అంబరాన్నంటాయి. రాజ్‌పథ్ వేదికగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ సందర్భంగా ఇండియన్ ఆర్మీ 21-గన్ సెల్యూట్ చేసింది. లెఫ్టినెంట్ కల్నల్ సి.సందీప్ సారథ్యంలోని 2233 ఫీల్ట్ బ్యాటరీ కమాండ్ ఆధ్వర్యంలో గన్ సెల్యూట్ జరిగింది. ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో హాజరయ్యారు. త్రివిద దళాల గౌరవ వందనం స్వీకరించడంతో కన్నులపండువగా పెరేడ్ మొదలైంది. ఉపరాష్ట్రపతి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా, పలు రాష్ట్రాల సీఎంలు, ఉన్నతాధికారులు, తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. నేషనల్ వార్ మెమోరియల్ స్థూపం వద్ద ప్రధాని మోదీ నివాళి అర్పించారు.

రాజ్‌పథ్‌లో జరిగిన పరేడ్ ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్రివిధ దళాలు, శకటాల ప్రదర్శనలు, సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆయుధాలు ఈ సారి గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో కొలువుదీరాయి. సరికొత్త ఆయుధాలు సైన్యం అమ్ములపొదిలోకి చేరాయి. ఇక అమర వీరులకు నివాళులర్పించే కార్యక్రమం ఈ సారి జాతీయ యుద్ధ స్మారకం వద్ద నిర్వహించారు. మిలటరీ పరేడ్‌లో భాగంగా యాంటీ శాటిలైట్ ఆయుధం శక్తి, బ్యాటిల్ ట్యాంక్ భీష్మ, చినూక్, అపాచీ హెలికాప్టర్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక ప్రపంచంలోనే అతిపెద్ద హార్స్ రెజిమెంట్ గ్వాలియర్ ల్యాన్సర్ కూడా గౌరవ వందనం సమర్పించింది. రిపబ్లిక్ డే పరేడ్‌లో గుర్రాలు స్పెషల్ ఎట్రాక్షన్గా నిలిచాయి. ఇక ఈ వేడుకల్లో పారాచ్యూట్ రెజిమెంట్ ప్రత్యేకంగా పాల్గొంది. నింగిలో నుంచి పారాగ్లైడింగ్ చేస్తూ విన్యాసాలు చేశారు సైనికులు. ఎయిర్ ఫోర్స్ నుంచి 144 మంది ఎయిర్ వారియర్స్ గౌరవ వందనం సమర్పించారు. ఈసారి గణతంత్ర వేడుకలో రాష్ట్రాల శకటాల్లో అన్నింటి కంటే ముందు ఛత్తీస్గఢ్ శకటం ప్రదర్శించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 16, కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి ఆరు చొప్పున మొత్తం 22 శకటాలు పాల్గొన్నాయి.

దేశీయ బోఫోర్స్‌గా పేరున్న ధనుష్ శతఘ్నులను ఈ సారి రిపబ్లిక్ డే పరేడ్ లో ప్రదర్శించారు. చినూక్ హెలికాప్టర్లు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఠీవీగా దర్శనమిచ్చాయి. వీటి ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలిచాయి. అపాచీ హెలికాప్టర్ల ప్రదర్శన ఆకట్టుకుంది. సీఆర్పీఎఫ్ మహిళా బైకర్స్ బృందం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లపై చేసే విన్యాసాలు ఈ పరేడ్కి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. మొత్తం 65 మంది సభ్యుల ఈ బైకర్స్ బృందం కొన్ని రోజులుగా రాజ్పథ్లో కఠోర సాధన చేసి దీనిలో పాల్గొంది. ఈ బృందం రాయల్ ఎన్పీల్డ్ 350 సీసీ బుల్లెట్ బైక్లపై విన్యాసాలను ప్రదర్శించింది. ఈ క్రమంలో తొమ్మిది రకాల విన్యాసాలు చేశారు.

తెలంగాణ, రాజస్థాన్, తమిళనాడు సహా 21 రాష్ట్రాలకు చెందిన శకటాలు రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొని ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలంగాణ విశేష పండుగైన బతుకమ్మ ఆకృతిలో రూపొందించిన శకటం, ప్రజల జీవన విధానం, సంప్రదాయ నృత్యరీతులతో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బతుకమ్మ, మేడారం జాతర, వెయ్యి స్థంభాల గుడితో థీమ్ ఏర్పాటు చేసిన శకటాన్ని పరేడ్ లో ప్రదర్శించారు. శకటంలో గిరిజన కళాకారుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ శకటం ప్రదర్శనను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ ఆసక్తిగా తిలకించారు. అసోం నుంచి వెదురు, కేన్ కళాకృతులతో రూపొందిన శకటం, విలేజ్ పోగ్రాంతో రూపొందించిన జమ్మూకశ్మీర్ శకటం, జానపద కళారీతులతో కూడిన తమిళనాడు శకటం, విశ్వమానవ విలువలను ప్రతిబిబించే అనుభవ మంటప కాన్సెప్ట్తో రూపొందించిన కర్ణాటక శకటాలతో పాటు రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా శకటాలు కూడా ఈ పరేడ్ లో పాల్గొన్నాయి.