దీపికా పదుకొణెపై ఆర్బీఐ మాజీ గవర్నర్‌ ప్రశంసలు…

దేశ రాజధానిలో జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై జరిగిన దాడిలో బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ప్రముఖ నటి దీపికా పదుకొణెపై విమర్శలతో పాటు ప్రశంసలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తాజాగా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్‌ రఘురామ్ రాజన్‌ దీపిక చర్యను సమర్థించారు. ఆమె ఎందరికో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ మేరకు `లింక్డ్‌ ఇన్‌` బ్లాగులో రాసుకొచ్చారు. భారత్‌లోని ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీల్లో ఒకటైన జేఎన్‌యూలో విద్యార్థులపై దాడి జరగడం, దాన్ని పోలీసులు ఏ మాత్రం అడ్డుకోకపోపవడం ఆందోళనకరం అని రాజన్‌ పేర్కొన్నారు. తన కొత్త సినిమా ఛపాక్‌ భవిష్యత్‌ను ప్రమాదంలో పెట్టి మరీ జేఎన్‌యూలో బాధిత విద్యార్థులను పరామర్శించి నిశ్శబ్ద ఆందోళన చేపట్టిన ఆ బాలీవుడ్‌ నటి మనందరిలో స్ఫూర్తిని నింపుతోందని కొనియాడారు.