కొత్త మున్సిపల్ చట్టంతో పట్టణ ప్రగతి :పల్లా రాజేశ్వర్‌రెడ్డి

టీఆర్ఎస్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మున్సిపాలిటీ చట్టం ద్వారా పట్టణ ప్రగతి జరగబోతుందని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్ల రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కొత్త చట్టంతో పచ్చని పట్టణాలు రాబోతున్నాయని.. అందుకే మున్సిపాలిటీల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం అవుతున్నారని అన్నారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి ముగ్గురు నలుగురు అభ్యర్థులు బరిలో దిగేందుకు పోటీ పడుతుంటే… ప్రధాన ప్రతిపక్షాలైన బీజేపీ, కాంగ్రెస్‌కు దాదాపు వెయ్యి వార్డుల్లో అభ్యర్థులు దొరకడం లేదని, ప్రచారంలో చెప్పేందుకు అంశాలు కూడా దొరకడం లేదని ఎద్దేవా చేశారు. అటు.. నామనేషన్ల ప్రక్రియలో మరో 24 గంటల సమయం ఉండగానే 30 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ ఏకగ్రీవమైందన్నారు.

బీజేపీ నాయకులు కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారని… రాష్ట్రం నుంచి పన్నుల రూపంలో రూ. 65,000 కోట్లు ఇస్తుంటే, రాష్ట్రానికి తిరిగి రూ. 25,000 కోట్లు కూడా ఇవ్వడం లేదన్నారు. స్మార్ట్‌ సిటీలుగా ఎంపిక చేసిన వరంగల్, కరీంనగర్ నగరాలకు కూడా నిధులు ఇవ్వలేదని చెప్పారు. రాష్ట్ర అంశాలు, జాతీయ అంశాల మీద స్పష్టత లేకుండానే స్థానిక బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని గమనించకపోవడం దురదృష్టకరమని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. రైతుకు పెట్టుబడి సహాయం కోసంతో పాటు… రైతు భీమా పథకాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. రుణ మాఫీ రూ. లక్ష లోపు విడతల వారిగా చేస్తామంటే ప్రజలు ఒప్పుకున్నారని.. ఇచ్చిన మాట మేరకు చేస్తామని చెప్పారు. 2014కు ముందున్న మున్సిపాలిటీల పరిస్థితిని… ప్రస్తుతం మున్సిపాలిటీల్లో ఉన్న పరిస్థితిని ఒకసారి పరిశీలించాలన్నారు. భారత దేశంలో అత్యుత్తమమైన ఎలక్ట్రానిక్ పాలసీ తెలంగాణలో అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతిపక్షాలు పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాయని పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.

మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి ప్రజల మద్దతుందన్న పల్లా రాజేశ్వర్‌రెడ్డి… మహిళలు ముగ్గుల ద్వారా, యువకులు కేసీఆర్ పంతగుల ద్వారా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్‌ పార్టీ సెక్యలర్ పార్టీ అని ప్రతిపక్షాల సర్టిఫికేట్ అవసరం లేదన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి విజన్ ఉందని.. పట్టణాలు బాగు చేస్తామని తెలిపారు. 22వ తేదిన జరిగే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ పార్టీకి పట్టం కట్టాలని ప్రజలను కోరారు.