5 రోజుల్లో 5వేల ఒంటెలను చంపేశారు…

అస్ట్రేలియాలో కార్చించు కారణంగా లక్షలాదిగా మూగ జీవాలు అగ్నికి ఆహుతవుతున్నాయి. అడవిని దహించి వేస్తున్న అగ్ని జ్వాలలు.. ఇప్పటికే మూగ జీవాల ఉసురు తీస్తున్నాయి. మరోవైపు… కరువు కారణంగా అక్కడి అధికారులు పశుమేధం సాగిస్తున్నారు. దక్షిణ ఆస్ట్రేలియాలోని అనంగు ఆదివాసీ ప్రాంతంలో ఐదు రోజుల్లో… దాదాపు 5000 కు పైగా ఒంటెలను కాల్చి చంపారు. హెలికాప్టర్లలో కూర్చున్న గన్‌మెన్లు ఒంటెలను కాల్చి నేలకూల్చారు. పచ్చదనం అధికమొత్తంలో కనిపించే అనంగు ప్రాంతంలో.. సుమారు 2500 మంది ఆదివాసీలు జీవిస్తున్నారు. ఆస్ట్రేలియా భూభాగం విశాలమైందైనప్పటికీ.. నీరు వంటి సహజవనరులు ఇక్కడ అరకొరగానే ఉంటాయి. తాజాగా, కరువుతో పాటు కార్చించు ప్రభావంతో ఆస్ట్రేలియాలో నీటి కొరత మరింత పెరుగుతోందని.. కార్చించు తాపానికి ఒంటెలు జనావాసాల మీద పడుతున్నాయి. అందుకే వాటిని మట్టుబెడుతున్నట్టు ఓ అధికారి తెలిపారు. ఐదురోజుల పాటు సాగిన ఒంటెల వేట ఇవాళ్టి(మంగళవారం)తో ముగిసిందని పేర్కొన్నారు.

ఇక, ఈ ఒంటెలు ఆస్ట్రేలియాకు చెందినవి కావని… 1840లలో దేశ అవసరాల కోసం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నవని తెలిపారు. వాటి వినియోగం క్రమంగా తగ్గడంతో అవి అడవుల్లోకి చేరాయని.. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఒంటెలు ఆస్ట్రేలియా అడవుల్లోనే ఉన్నాయని వెల్లడించారు. పెద్ద సంఖ్యలో పెరిగిన ఒంటెలు గిరిజన ప్రజల జనావాసాలతో పాటు చెట్లు, నీటి వనరులను ధ్వంసం చేస్తున్నాయని, దీంతో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు వెల్లడించారు. జంతు ప్రేమికుల ఆందోళనను అర్థం చేసుకుంటాం. కానీ, ఆ మారుమూల ప్రాంతంలోని స్థానిక తెగలవారు ఒంటెల కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాల్సిన అవసరం ఉందని అధికారులు వెల్లడించారు. తాజాగా, కార్చించు ప్రభావంతో ఈ ఇబ్బందులు మరింత పెరిగాయని చెప్పారు. కాగా.. కరువు కారణంగా 10,000 ఒంటెలను చంపాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.