నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై సందిగ్ధం…

నిర్భయ కేసులోమరో ట్విస్ట్ నెలకొంది. దోషుల ఉరిశిక్ష అమలు మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. దోషుల్లో ఒకడైన ముఖేష్ సింగ్ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ పిటిషన్‌ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. రెండు వారాల్లో క్షమాభిక్ష పిటిషన్‌పై రాష్ట్రపతి నిర్ణయం వెల్లడించనున్నారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగ్గా.. క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణ తర్వాత ఉరిశిక్ష అమలు చేయడానికి మధ్య 14 రోజుల వ్యవధి ఉండాలని హైకోర్టుకు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. దీంతో తీహార్ జైలు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఢిల్లీ హైకోర్టు… క్షమాభిక్ష పిటిషన్‌ను పంపడంలో ఆలస్యం ఎందుకు జరిగిందని ప్రశ్నించింది. దీంతో ఈ నెల 22న అమలు కావాల్సిన ఉరిశిక్ష, మరింత ఆలస్యం కానుందని తెలుస్తోంది. ఢిల్లీ ప్రభుత్వం, తీహార్ జైలు అధికారుల తీరుపై నిర్భయ తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నిర్భయ దోషులకు ఈ నెల 22న ఉరి తీయాలని పాటియాల కోర్టు తీర్పునివ్వగా.. దానిపై ఇద్దరు నిందితులు సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. వాటిపై విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం వాటిని కొట్టివేసింది. దీంతో, చివరి అస్త్రంగా క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నాడు ముఖేష్ సింగ్.