మున్సిపల్ మేయర్, ఛైర్మన్ల ఎన్నికకు నోటిఫికేషన్…

మున్సిపల్‌ మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ అయింది. ఈ నెల 27న కొత్త పాలకమండళ్ల సమావేశం నిర్వహించి.. ఆ సమావేశంలోనే ఎన్నిక పక్రియ నిర్వహించ నున్నట్టు ఈసీ పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. జనవరి 25న మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. దీంతో మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో గెలిచిన సభ్యులు జనవరి 27వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. అనంతరం కొత్త పాలకమండలి తొలి సమావేశం నిర్వహించనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ సమావేశంలోనే మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆ వెంటనే డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్మన్ల ఎన్నిక జరగనున్నట్టు తెలిపింది. నగర మేయర్‌, డిప్యూటీ మేయర్‌, మున్సిపల్ ఛైర్మన్‌, డిప్యూటీ ఛైర్మన్ల ఎన్నికకు సంబంధించి ఈ నెల 25న… నోటీసు ఇస్తామని అధికారులు వెల్లడించారు.