మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలి…

జాతరను జాతీయ స్థాయిలో గుర్తింపు కల్పించాలని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. బీజేపీ నాయకులకు ఆదివాసులపై ఏ మాత్రం ప్రేమ ఉన్నా ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలన్నారు. హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన… జాతీయ పండుగగా మేడారం జాతరను గుర్తింపు తీసుకురావడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించు కోవడంలేదన్నారు.

రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మేడారం జాతరను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని.. ఈ జాతరకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి కోటి మంది భక్తులు తరలి వస్తారన్నారు. రేపు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ టీఆర్ఎస్‌ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించి… ప్లాస్టిక్ రహిత మేడారం కోసం వనదేవతలపై ప్రమాణం చేస్తామని తెలిపారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి మేడారం వెళ్లే బస్సుల్లో… క్లాత్ బ్యాగులను పంపిణీ చేస్తామని చీఫ్ విప్ వినయ్ చెప్పారు.