సిరిసిల్లను మరింత అభివృద్ధి చేస్తాం :మంత్రి కేటీఆర్

సిరిసిల్ల మున్సిపాలిటీని దేశంలోనే ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లోభాగంగా… సిరిసిల్ల మున్సిపాలిటీకి టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోను మంత్రి కేటీఆర్‌ కేటీఆర్ విడుదల చేశారు. అనంతరం… ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురు కౌన్సిలర్లకు అభినందించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… సిరిసిల్లలో ఓటు అడిగే హక్కు ఒక్క టీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రమే ఉందన్నారు. సిరిసిల్లను జిల్లా కేంద్రంగా మార్చడమే కాకుండా జాతీయ స్థాయి అవార్డులు వచ్చేలా తీర్చిదిద్దామన్నారు. సిరిసిల్లకు గోదావరి జలాలు తెచ్చినట్లే.. రెండేళ్లలో రైలు సేవలు కూడా అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. టికెట్ రానివాళ్ల సేవలను గుర్తించి గౌరవిస్తమని తెలిపారు.

టీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో సిరిసిల్ల రూపురేఖలు మారాయన్నారు మంత్రి కేటీఆర్. గత ఐదేళ్లలో నేతన్నల వేతనం రెట్టింపు అయ్యేలా చేతినిండా పని కల్పించామని తెలిపారు. అప్పరెల్‌ పార్క్‌తో స్థానికులకు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. త్వరలోనే సిరిసిల్లలో జేఎన్‌టీయూ కళాశాల ఏర్పాటు చేయిస్తామన్నారు. ఇప్పటికే పరకాల, చెన్నూరు మున్సిపాలిటీల్లో దాదాపు గెలిచామని.. త్వరలో భారీ విజయాన్ని అందుకోబోతున్నామని చెప్పారు. రాబోయే వారం రోజులు నాయకులు, కార్యకర్తలు అందరినీ కలుపుకొని పోవాలని, కష్టపడి పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు. ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలిసి ఓట్లు అడగాలన్నారు సూచించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వారు ఇతర వార్డుల్లో ప్రచారం చేయాలని దిశానిర్ధేశం చేశారు. కారు గుర్తుతో వచ్చే వారినే టీఆర్ఎస్ అభ్యర్థులుగా గుర్తించాలని… తాము కూడా టీఆర్‌ఎస్‌ అని మభ్యపెట్టేవారి విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

పురపాలక పోరులోనూ టీఆర్ఎస్ పార్టీదే విజయమని మంత్రి కేటీఆర్ మరోసారి స్పష్టం చేశారు. ఇంటింటికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని.. రాబోయే ఐదేళ్లలో రెట్టింపు పని చేస్తామని తెలిపారు. కులాలు, మతాల పేరుతో ప్రజలను విభజించొద్దని సూచించారు. ఎన్నికల్లో ప్రతిపక్షాలకు చెప్పుకునేందుకు ఏమీ లేదన్నారు కేటీఆర్. కాంగ్రెస్ చెయ్యగలిగిందేమీ లేదని… బీజేపీ కూడా చేసేదేమీ లేదని ఎద్దేవా చేశారు. అడ్డిమారి గుడ్డి దెబ్బలాగా కరీంనగర్‌ లోక్‌సభ స్థానాన్ని బీజేపీ గెలుచిందని ఎద్దేవా చేశారు.

కొత్త మున్సిపల్‌ చట్టంపై పాలకవర్గాలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. అవినీతి రహిత పాలన, స్వచ్ఛ పట్టణాలే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. గెలిచిన తరువాత పని చేయకపోతే కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లను తొలగించేలా కొత్త చట్టం తెచ్చినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. పదవులు ఉండడం, పోవడం అనేది మీరు చేసే పనుల మీదే ఆధారపడి ఉందన్న మంత్రి… పదవులు పోతే తన బాధ్యత కాదని హెచ్చరించారు. రాబోయే నాలుగేళ్లు ఏ ఎన్నికలు లేనందున… పుర పాలన, పరిపాలనే మన లక్ష్యమన్నారు. ఈ ఎన్నికల్లో సిరిసిల్ల జిల్లాలో మాత్రమే ప్రచారం చేస్తానన్న మంత్రి… కాంగ్రెస్‌ నేత కోదండరెడ్డి కోరిక మేరకు రాష్ట్రంలో జరిగే మిగతా చోట్ల ప్రచారం చేయనని తెలిపారు. మున్సిపల్ ఫలితాలు తమ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.