కైట్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్..

భిన్నత్వంలో ఏకత్వం భారత్ గొప్పదనం కాగా.. హైదరాబాద్‌ మినీ ఇండియా లాంటిదని కేటీఆర్ తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రం పౌరులైనా హైదరాబాద్‌ను సొంతింటిలా భావిస్తారన్నారు. సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌… మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో కలిసి నైట్ కైట్‌ ప్రదర్శనను తిలకించారు. దాదాపు 20 దేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లైయర్స్‌కు కేటీఆర్ స్వాగతం తెలిపారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌ నగరంలో దశాబ్ధాలుగా స్థిరపడ్డ వాళ్లు ఎందరో ఉన్నారని… దేశంలో ఎక్కడా లేని విధంగా నగరంలో గుజరాత్ గల్లీ, పార్శిగుట్ట లాంటి ప్రాంతాలున్నాయని గుర్తుచేశారు.

హైదరాబాద్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్‌కు వివిధ దేశాల నుంచి ఔత్సహికులు ఇక్కడికి రావడం సంతోషకరమన్న మంత్రి… ఐదు సంవత్సరాలుగా కైట్ ఫెస్టివల్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక శాఖకు అభినందనలు తెలిపారు. కుటుంబంతో వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేలా చేసిన ఏర్పాట్లను ఆయన ప్రశంసంచారు. అహ్మదాబాద్ కంటే ఘనంగా కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నామని… దేశంలోనే కైట్ ఫెస్టివల్ లాంటి కార్యక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకుందామని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్ కృషే కారణం…
అనంతరం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ మాట్లాడుతూ… తెలంగాణ ఏర్పడితే అభివృద్ధి జరిగిందని ఎన్నో అపోహలు, ప్రచారాలు చేశారని గుర్తుచేశారు. ఆనాడు సీఎం కేసీఆర్ చెప్పినట్టుగానే హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. హైదరాబాద్ ఖ్యాతి దేశ విదేశాలకు విస్తరిస్తోందంటే సీఎం కేసీఆర్ కృషే కారణమని తెలిపారు. అన్ని ఒకే దగ్గర ఉండేలా ఫెస్టివల్ నిర్వహించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచన, మంత్రి కేటీఆర్ ఆదేశాలతో భారీ ఏర్పాట్లు చేశామన్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందడంలో మంత్రి కేటీఆర్ పాత్ర కీలకమని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.