పల్లె ప్రగతి స్ఫూర్తి ఎప్పటికీ కొనసాగాలి: మంత్రి ఎర్రబెల్లి

సంక్షేమం విషయంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. `ఆదాయం పెంచాలి… పేదలకు పంచాలి` అనేది టీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని తెలిపారు. హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖలకు సంబంధించిన ఆయా శాఖల ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో 2020–21 వార్షిక బడ్జెట్ ప్రతిపాదనల తయారీపై ప్రధానంగా చర్చించారు.

ఆసరా పెన్షన్ల రూపంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల పేదలకు అండగా నిలుస్తున్నారని ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని… రాష్ట్ర బడ్జెట్‌లో ఎక్కువ శాతం సంక్షేమానికి కేటాయిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అదే సమయంలో రాష్ట్రంలో అభివృద్ధి ప్రక్రియను వేగంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన మేరకు సాయం అందడంలేదని అన్నారు. ఉపాధిహామీ పథకం అమలుకు సంబంధించి, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రూ. 250 కోట్ల నిధులు రావాల్సి ఉందని… ఆ నిధుల విడుదల విషయమై కేంద్రాన్ని ఇప్పటికే పలుసార్లు కోరినట్లు మంత్రి తెలిపారు. దీనిపై కేంద్రానికి మరోసారి లేఖ కూడా రాయాలని అధికారులకు సూచించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి దీనిపై కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. తాజా ఉపాధిహామీ పథకం ప్రతిపాదనల‌్లో వైకుంఠధామాలు, ఇంకుడు గుంతలు, గ్రామపంచాయతీల్లో సీసీ రోడ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు వివరించారు.

పల్లె ప్రగతి నిరంతర ప్రక్రియ అని మంత్రి ఎర్రబెల్లి అన్నారు. అలాగే, పల్లె ప్రగతి అమలులో పనితీరు బాగా ఉన్న గ్రామపంచాయతీలకు సీసీ రోడ్ల కోసం… రూ. 20 లక్షల చొప్పున ప్రత్యేకంగా నిధులు ఇచ్చేలా ప్రణాళిక ఉండాలన్నారు. పల్లె ప్రగతి అమలులో ముందున్న గ్రామపంచాయతీల వివరాలను పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రూపొందించాలని ఆదేశించారు. పల్లె ప్రగతి స్ఫూర్తిని ఎప్పటికీ కొనసాగించాలని సూచించారు. రెండో విడత పల్లె ప్రగతి సైతం రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా జరిగిందని తెలిపిన మంత్రి… డ్రైనేజీల శుద్ధీకరణ విషయంలో కొంత నిర్లక్ష్యం ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై ప్రధానంగా దృష్టి పెట్టాలని మంత్రి ఆదేశించారు. `ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన` మూడో దశ కింద మన రాష్ట్రానికి 800 కిలోమీటర్ల రోడ్లు మంజూరు అయ్యాయని మంత్రి తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి దీనికి సంబందించిన పూర్తి ప్రదిపాదనలు అందాయని తెలిపారు. మిగిలిన జిల్లాల నుంచి సైతం వీలైనంత త్వరగా పూర్తి స్థాయి ప్రతిపాదనలు వచ్చేలా చూడాలని కోరారు. ఫిబ్రవరి 10లోపు ప్రతిపాదనలు పంపే ప్రక్రియ మొత్తం పూర్తి కావాలన్నారు.

దేశానికి ఆదర్శంగా నిలిచిన మిషన్ భగీరథ కార్యక్రమంపై అందరి నుంచి ప్రశంసలు వస్తున్నాయని.. సీఎం కేసీఆర్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఇటీవల మన రాష్ట్రానికి వచ్చిన ఉన్నతస్థాయి ఇంజనీర్ల బృందం ప్రశంసించిందని తెలిపారు. మిషన్ భగీరథకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చేలా ప్రయత్నాలను కొనసాగించాలని మంత్రి దయాకరావు అధికారులతో అన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్‌ రాజ్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఈఎన్‌సీ సత్యనారాయరెడ్డి, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, సీఈలు పాల్గొన్నారు.