మద్దతివ్వండి.. అభివృద్ధి చూపిస్తాం :మంత్రి ఎర్రబెల్లి

మున్సిపల్ ఎన్నికల్లో తొర్రూరు పురపాలికపై టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. మొత్తం 16 వార్డుల్లో రెండు ఏకగ్రీవమయ్యాయని, మిగిలిన 14 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు భారీ ఆధిక్యంతో గెలిచేలా సమష్టిగా కృషి చేయాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన నేపథ్యంలో తొర్రూరులోని తన క్యాంపు కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలతో మంత్రి సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ ఆధిక్యంతో గెలిపించాలని ప్రజలను కోరారు. సంక్రాంతి రోజు నుంచే అన్ని వార్డులలో ప్రచారాన్ని పెంచాలని కార్యకర్తలకు సూచించారు. టీఆర్‌ఎస్‌ గెలుపు కోసం పని చేసిన వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందన్న మంత్రి… అందరికీ అవకాశాలు వచ్చేలా చూస్తానన్నారు. టీఆర్‌ఎస్‌ తరపున ఎక్కువ మంది టిక్కెట్లు ఆశించారని… పార్టీ కోసం ఉపసంహరించుకున్న అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అభ్యర్థిత్వాలను ఉపసంహరించుకున్న వారి త్యాగం గొప్పదని కొనియాడారు. సంక్రాంతి రోజు నుంచి ప్రచారం ప్రారంభిస్తానని… పార్టీ నేతలు, శ్రేణులు అందరు కలిసి ముందుకు సాగాలని అన్నారు. బంగారు తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంతోనే తొర్రూరు అభివృద్ధి మరింత ముందుకు సాగుతుందని సూచించారు. తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని, వచ్చే రెండేళ్లలో పట్టణం సమగ్ర స్వరూపం మారేలా పని చేస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.