టీఆర్ఎస్‌ అంటే `తిరుగులేని రాజకీయ శక్తి` :మంత్రి కేటీఆర్

టీఆర్ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుందని తెలిపారు. టీఆర్ఎస్ ఫేస్‌బుక్ ఖాతాలో 11 లక్షల మంది, ట్విట్టర్‌లో 3.6 లక్షల మంది ఫాలోవర్స్‌ ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఇతర పార్టీలు కూడా ఈ సంఖ్యకు దరిదాపుల్లో లేవన్నారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల సమావేశానికి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… టీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియా ఓ బలమని తెలిపారు. ప్రధాన మీడియాకు ప్రత్యామ్నాయంగా సోషల్ మీడియా మారిందన్నారు. ప్రజలకు చెప్పాలనుకున్నది నేరుగా చెప్పడానికి మంచి వేదిక సోషల్ మీడియా అని తెలిపారు. సీఎం కెసిఆర్ కూడా సోషల్ మీడియా లో క్రియా శీలకంగా ఉంటారని.. ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడానికి కేసీఆర్‌ సోషల్ మీడియానే ఓ సాధనమని నమ్ముతారని తెలిపారు. ఈ సదర్భంగా టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జులుగా క్రిషాంక్‌, జగన్, సతీష్, దినేష్‌లను మంత్రి కేటీఆర్ నియమించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాసడ్ గౌడ్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్సీలు శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావు, యెగ్గే మల్లేష్‌లు పాల్గొన్నారు.

ప్రజల్లో ఏ బలం లేకుండా కేవలం సోషల్ మీడియాతో పార్టీలు మనుగడ సాధించలేవని… ప్రజల్లో ఆదరణ ఉండే పార్టీలకు సోషల్ మీడియా అదనపు బలంగా ఉంటుందని ప్రతిపక్షాలకు చురకలంటించారు మంత్రి కేటీఆర్. కొందరు నేతలు, కొన్ని పార్టీలు చిచ్చు పెట్టేందుకే సోషల్ మీడియాను వాడుకుంటున్నాయని… టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ సోషల్ మీడియాను ఉద్రిక్తతలు పెంచేందుకు వాడుకోలేదని తెలిపారు. తిమ్మినిబమ్మిని చేయడంలో విపక్షాలు సిద్ధహస్తులని మంత్రి దుయ్యబట్టారు. సోషల్ మీడియాలో వాస్తవాలు వివరించాలన్న ఆయన… దూషణల పర్వం వద్దని హితువు పలికారు. సోషల్ మీడియాలో టీఆర్ఎస్ ఎపుడూ దూషణలను ప్రోత్సహించదని స్పష్టంచేశారు.

సబ్జెక్టుతో తిప్పికొట్టండి…
టీఆర్ఎస్ సోషల్ మీడియా సైనికులు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి సీఎం కేసీఆర్‌పై అభిమానంతోనే టీఆర్ఎస్‌ సోషల్ మీడియా సైనికులు పనిచేస్తున్నారని గుర్తుచేశారు. ఇతర పార్టీల దుష్ప్రచారాన్ని టీఆర్‌ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు సమర్థవంతంగా తిప్పికొట్టాలని సూచించారు. ప్రతిపక్షాల అసభ్య విమర్శలు, అసత్య ప్రచారాలకు టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు సబ్జెక్టుతో కొట్టాలని, ప్రతి విమర్శలకు దిగొద్దని దిశానిర్ధేశం చేశారు. ప్రతి గడపకు టీఆర్ఎస్‌ సందేశం వెళ్ళాలన్న కేటీఆర్… ఇందుకోసం సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీకి మధ్య సమన్వయము పెరగాలన్నారు. దీని కోసమే.. క్రిశాంక్, సతీష్ రెడ్డి, జగన్ మోహన్ రావు, దినేష్ చౌదరీలను పార్టీ సోషల్ మీడియా కో-ఆర్డినేట్లను నియమిస్తున్నట్టు తెలిపారు. టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలకు వేధింపులు వస్తే పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు పనిచేయాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీల్లోని టీఆర్ఎస్ సభ్యులను ముందుగా యాక్టివేట్ చేయాలని సూచించారు. ఈ మకర సంక్రాంతితో ప్రతిపక్షాల భ్రాంతి కూడా తొలగాలన్నారు. అలాగే సోషల్ మీడియా గులాబీ సైనికులకు తగిన గుర్తింపు, గౌరవం ఇస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

రెట్టింపు నిధులు విడుదల చేశాం…
అటు రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నామన్న మంత్రి కేటీఆర్… కాంగ్రెస్ హాయంలో మున్సిపాలిటీలకు నిధులు ఎక్కువ విడుదలయ్యాయంటున్నా ఉత్తమ్ దమ్ముంటే శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2004 నుంచి 2014 మధ్య విడుదల చేసిన నిధుల కంటే గత ఐదేళ్ల లో రెట్టింపు నిధులు విడుదల చేశామని తెలిపారు. అన్ని మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ లైట్లు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దేశానికి తెలంగాణ ఆదర్శమని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించిన విషయాన్ని గుర్తుచేశారు. గతంలో మంచి నీళ్ల కోసం ఖాళీ బిందెలతో ధర్నాలు చేసేవారని.. ఇప్పుడు ఎక్కడా నీళ్ల కోసం ఆందోళనలు లేవని చెప్పారు. రాష్ట్రంలో తాగునీటి సమస్య దాదాపు తీరిపోయిందన్నారు. అటు, 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కల సాకారం అవుతుందని చెప్పారు. ఈ వాస్తవాలను ప్రచారం చేయాలని టీఆర్ఎస్‌ సోషల్ మీడియా సైనికులకు మంత్రి వివరించారు.

కొత్త చట్టం అమలు…
కొత్త మున్సిపల్ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయడమే తన ముందున్న ప్రధాన బాధ్యత అన్నారు మంత్రి కేటీఆర్. కొత్త మున్సిపల్ చట్టం నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ నిర్మాణాలు చేపట్టినా.. తొలగిస్తామన్నారు. కొత్త చట్టం ప్రకారం 75 గజాల వరకు స్థలంలో ఎటువంటి అనుమతి లేకుండా ఇల్లు కట్టుకోవచ్చన్న మంత్రి… 75 గజాల కంటే ఎక్కువ స్థలంలో నిర్మాణాలకు 21 రోజుల్లోనే అనుమతులు ఇచ్చేలా నిబంధనలు ఉన్నాయన్నారు. 21 రోజుల్లో అప్లికేషన్‌పై రిప్లై ఇవ్వకపోతే.. పర్మీషన్ ఇచ్చినట్టే పరిగణించాలని కొత్త చట్టంలో ఉందన్నారు. నిబంధనలు పాటించని వాటిని మున్సిపల్ చట్టం ప్రకారం తొలగించే ప్రక్రియలో.. టీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటే, వారి నుంచే కూల్చవేత ప్రారంభిస్తాం అని మంత్రి కేటీఆర్ తెలిపారు. అటు… మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులకు ఫిబ్రవరి, మార్చ్‌ నెలల్లో శిక్షణ ఇస్తామన్నారు మంత్రి కేటీఆర్.

మోదీ, రాహుల్ అన్నా భయం లేదు…
బీజేపీ అంటే కేటీఆర్ భయపడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేటీఆర్.. వాళ్ళ పార్టీ అంటే భయం లేదని, చివరకు మోదీ, రాహుల్ గాంధీ అన్నా ఏం భయం లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి ఏముందని భయపడాలని ప్రశ్నించిన కేటీఆర్… 600 లకు పైగా స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులను నిలపలేక పోయిందని విమర్శించారు. అటు.. తెలంగాణలో ఇచ్చే పెన్షన్లలో కేంద్రం వాటా గురించి బీజేపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.