హెలికాఫ్టర్‌ ప్రమాదంలో బాస్కెట్‌బాల్ దిగ్గజం మృతి…

బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రయింట్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించారు. కాలిఫోర్నియాలోని లాస్‌ఏంజెల్స్‌లో హెలికాఫ్టర్‌ కూలిన దుర్ఘటనలో కోబ్‌ బ్రయింట్, ఆయన కుమార్తె(13) జియానాతో సహా 9 మంది మృతి చెందారు. ఆయన ప్రయాణిస్తున్న సికోర్సికీ ఎస్ 76 హెలికాఫ్టర్‌ లాస్‌ఏంజెల్స్‌లోని పశ్చిమాన ఉన్న ఓ కొండను ప్రమాదవశాత్తు ఢీకొంది. ఈ ఘటనలో హెలికాఫ్టర్‌లో ప్రయాణిస్తున్న అందరూ కన్నుమూశారు. ప్రయాణికుల ప్రాణాలు కాపాడటానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించిందని, అయినా ఎవరిని కాపాడలేకపోయామని అక్కడి అధికారులు పేర్కొన్నారు. బాస్కెట్‌బాల్‌ చరిత్రలో తన కంటూ బ్రయింట్‌ ఎన్నో రికార్డులు సృష్టించుకున్నాడు. ఏకంగా అయిదు సార్లు ఎన్‌బీఏ ఛాంపియన్‌గా నిలిచాడు. అంతేకాకుండా రెండు సార్లు (2008, 2012) ఒలింపిక్‌ స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. రెండు దశాబ్దాలుగా బాస్కెట్‌బాల్‌లో మెరిసిన ఈ అమెరికా ప్లేయర్‌ 2016లో రిటైర్మెంట్ ప్రకటించాడు.

ఇక.. కోబ్‌ బ్రయింట్‌ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, మాజీ అధ్యక్షుడు ఒబామా సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. కాలిఫోర్నియాలోని హెలికాఫ్టర్‌ ప్రమాదంలో బాస్కెట్‌బాల్‌ దిగ్గజం కోబ్ బ్రయింట్‌తోపాటు మరొకొంత మంది మరణించారని తెలిసింది. ఇది ఎంతో భయంకరమైన వార్తని ట్రంప్‌ ట్వీట్‌ చేయగా.. బాస్కెట్‌బాల్‌లో కోబ్‌ ఓ లెజెండ్‌ అని, కోబ్‌తో పాటు అతడి కుమార్తె గియానా కూడా ప్రమాదంలో మరణించడం ఎంతో బాధాకరమని ఒబామా విచారం వ్యక్తం చేశారు. కోబ్ కుటుంబానికి ఆయన సంతాపం తెలిపారు.