రేపు కరీంనగర్ కార్పొరేషన్‌ పోలింగ్…

కరీంనగర్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 58 డివిజన్లకు… రేపు(శుక్రవారం) ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవ వరకు పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం అధికారులు 348 పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ అన్ని చర్యలు తీసుకుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. దొంగ ఓట్లు పోల్ అవకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామన్నారు.

కరీంనగర్ కార్పొరేషన్‌లో మొత్తం 60 డివిజన్లు కాగా.. వాటిలో రెండు చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలుపొందారు. 20వ డివిజన్‌లో తుల రాజేశ్వరి, 37వ డివిజన్‌లో చల్ల స్వరూపారాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో, మిగిలిన 58 స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరుగనుండగా.. మొత్తం 371 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కార్పొరేషన్‌ పరిధిలో 2,72,195 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక.. ప్రతీ పోలింగ్‌ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్‌ తో పాటు నలుగురు సిబ్బంది ఉండనున్నారు. ఎన్నికల విధుల్లో దాదాపు 2,000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌కు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల 27వ తేదీన చేపట్టి… ఫలితాలు ప్రకటిస్తారు.