జెఎన్‌యూ దాడి కొందరి కుట్ర :కపిల్‌ సిబల్‌

జెఎన్‌యూలో హింసను కొందరు కుట్రపూరితంగానే సృష్టించారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్‌ తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు. మాస్కులు ధరించిన వ్యక్తులను క్యాంపస్‌లోకి ఎందుకు అనుమతించారని ప్రశ్నించారు. ఆ సమయంలో వర్సిటీ వీసీ ఏం చేశారో చెప్పాలన్నారు. పోలీసులు వర్సిటీ బయట ఎందుకు నిలబడ్డారో.. హోంమంత్రి ఏం చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. అటు జేఎన్‌యూలో హింస వర్సిటీ అధికార యంత్రాంగం, ఢిల్లీ పోలీసుల కనుసన్నల్లోనే జరిగిందని మరో కాంగ్రెస్‌ నేత రణదీప్‌ సుర్జేవాలా ఆరోపించారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఢిల్లీ పోలీసులను నియంత్రిస్తున్నారన్నారు. ఈ దాడి ఎవరి ప్రోద్బలంతో జరిగిందో సమాజానికి తెలుసన్నారు సుర్జేవాలా.