దాడి ఏబీవీపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల పనే :అయిషే ఘోష్

ఢిల్లీ జేఎన్‌యూలో ముసుగు వేసుకుని దాడికి పాల్పడ్డ ఘటనపై… దాడిలో గాయపడ్డ జెఎన్‌యూ విద్యార్థి సంఘం నాయ‌కురాలు అయిషే ఘోష్ స్పందించారు. ముసుగు దుండగుల దాడిలో గాయపడిన ఆమె… ఎయిమ్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. తమపై దాడికి పాల్పడింది ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలేనని అయేష్ ఘోష్ తెలిపారు. ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం విద్యార్థులపై దాడి చేశార‌ని ఆమె అన్నారు. గత నాలుగు, ఐదు రోజులు యూనివర్శిటీలో దాడులు చేసేందుకు ఏబీవీపీ ప్రయత్నిస్తుందని ఆమె చెప్పారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ ప్రొఫెస‌ర్లు గ‌త కొన్ని రోజుల నుంచి దాడికి ఉసి గొల్పుతున్నార‌ని ఆరోపించిన ఘోష్.. జేఎన్‌యూ సెక్యూరిటీ, విధ్వంస‌కారులు ఒక్క‌టై దాడి చేశార‌ని, విధ్వంసం సృష్టిస్తుంటే జేఎన్‌యూ సెక్యూర్టీ అడ్డుకోలేద‌న్నారు.

ఆదివారం క్యాంపస్‌లోకి ప్రవేశించి హాకీస్టిక్‌లు, ఇనుపరాడ్లతో తమపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని ఆమె డిమాండ్‌ చేశారు. దాడికి పాల్పడ్డ వారిలో కొందరిని తాను గుర్తుపట్టగలనని.. ఘర్షణలు చెలరేగిన క్రమంలో కొందరి ముసుగులు చెదిరిపోయాయని చెప్పారు. తాను పూర్తిగా కోలుకున్న తర్వాత ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. దాడికి కారకుడైన వీసీని తక్షణమే తొలగించాలని అయేష్ ఘోష్ డిమాండ్ చేశారు. ఈ దాడిని ప్రతిఒక్కరూ ఖండించాలని ఆమె పిలుపునిచ్చారు.