ముగిసిన ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌…

రంగురంగుల పతంగులు ఆకాశంలో విహాంగాలై విహరించాయి. నోరూరించే మిఠాయిలు ఆహార ప్రియులు, సందర్శకులను ఆహా అనిపించాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించిన కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ఇవాళ్టి(బుధవారం)తో ముగిసింది.

హైదరాబాద్ లో ఏటా నిర్వహించే అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. మూడు రోజుల పాటు జరిగిన వేడుకల్లో.. రంగురంగుల పతంగులు, నోరూరించే మిఠాయిలు, డీజే మోతలతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ హోరెత్తింది. దేశ, విదేశాలకు చెందిన పతంగులు.. వినువీధిలో హోయలొలుకుతూ గిరికీలు కొట్టాయి. రకరకాల ఆకృతుల్లో, చిన్నా పెద్ద పతంగులను చూసి.. సందర్శకులు తెగ సంబురపడ్డారు. ఈ ఫైనల్ ఈవెంట్‌కు.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. దేశ విదేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లైయర్స్‌ను.. మంత్రి అభినందించారు. మూడు రోజుల పాటు జరిగిన వేడుకల్లో సుమారు పదిలక్షలకు పైగా సందర్శకులు పాల్గొన్నారు. కైట్‌ ఫెస్ట్‌లో పాల్గొని… విజేతలైన వారికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ బహుమతులు అందజేశారు.

మూడు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ కైట్స్ అండ్ స్వీట్స్ ఫెస్టివల్ కు అద్భుత స్పందన వచ్చింది. రోజూ లక్షలాదిగా జనం ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సింగపూర్, తైవాన్, ఉక్రెయిన్, థాయ్ లాండ్, జర్మనీ వంటి దేశాలతో పాటు.. మన దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా కైట్ ఫ్లయర్స్ ఈ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. అటు.. భారీ సైజులో, భిన్న ఆకారాల్లో, ఎల్ఈడీ లైట్లతో ఎగిరే.. రంగురంగుల పతంగులను చూసేందుకు పెద్ద ఎత్తున సందర్శకులు తరలివచ్చారు.

సికింద్రాబాద్ నడిబొడ్డున ఆహ్లాదకరమైన గాలిలో నృత్యం చేస్తున్న కార్టూన్, ఫన్నీ ఎమోజీ, టైగర్, డ్రాగన్, మొసలి, గుర్రం పంతగుల అందాలు చూస్తూ సందర్శకులు సంతోషంలో మునిగితేలారు. అమీబా, పారాచ్యూట్, తాబేలు, కేరళ పేరిణి నృత్యం నమూనా, డాల్ఫిన్, త్రివర్ణ పతాకం, చిలుక, చింపాంజీ, గద్ద, పిల్లి, భూచక్రం, చిత్రాలతో కూడిన భిన్న రకాల పతంగులు ఆకాశంలో ఎంతో కనువిందు చేశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఆ అందాలు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జంట నగరవాసులు పోటెత్తారు. పరేడ్ గ్రౌండ్ కు కుటుంబసభ్యులతో వచ్చి సంతోషంగా గడిపారు. విదేశాల నుంచి వచ్చిన కైట్ లవర్స్ పతంగులు ఎగరవేస్తూ, సంతోషంగా గడిపారు. ఇక, ఈ ఫెస్టివల్లో ఏర్పాటు చేసిన స్వీట్స్.. ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేశారు. దేశవ్యాప్తంగా ప్రముఖ మిఠాయిలన్నీ ఈ ఫెస్టివల్‌లో కొలువుదీరాయి. కళ్లముందు రాశులుగా వందలాది రకరకాల మిఠాయిలు.. సందర్శకుల నోళ్లను ఊరించాయి. 25 రాష్ట్రాలకు చెందిన వెయ్యి రకాలకుపైగా స్వీట్స్, 300 రకాల స్నాక్స్‌ను కుటుంబ సమేతంగా ఆస్వాదించారు. అటు.. జింఖానా గ్రౌండ్‌లో తెలంగాణ సాంప్రదాయ ఆటలను ఏర్పాటు చేశారు.