వాంఖడే వన్డే: భారత్ ఘోర పరాజయం

ముంబై వాంఖడే వన్డేలో భారత్ ఘోర పరాజయం చవిచూసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్‌.. భారత్ నిర్ధేశించిన స్కోర్‌ను వికెట్ నష్టపోకుండా చేధించింది. 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 49.1 ఓవర్ల వద్ద 255 పరుగలు చేసి ఆలౌట్ అయింది. భారత్ నిర్ధేశించిన 256 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోకుండా… కేవలం 37.3 ఓవర్లలోనే చేధించి… తొలి మ్యాచ్‌ను సునాయసంగా తన ఖాతాలో వేసుకుంది. ఈ మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ఆధిక్యం సాధించింది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్‌ ప్రారంభంలోనే 13 పరుగుల వద్ద రోహిత్ శర్మ 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్‌తో కలిసి శిఖర్ ధావన్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలోనే ధావన్ తన అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. మూడు పరుగుల చేస్తే అర్ధసెంచరీ పూర్తవుతుందన్న దశలో కేఎల్ రాహుల్ (47) పెవిలియన్ చేరాడు. 74 పరుగుల వ్యక్తిగత స్కోరు చేసిన ధావన్‌.. మూడో వికెట్‌గా ఔటయ్యాడు. నాలుగో వికెట్‌గా క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ.. 156 పరుగుల వద్ద 16 పరుగులు చేసి ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఔటయ్యాడు. తర్వాత 168 పరుగుల వద్ద యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (4) పెవిలియన్ చేరారు. వరుసగా 30 పరుగుల తేడాతో నాలుగు వికెట్లు పడడం టీమిండియా ఓటమికి బాటలు వేశాయి. అనంతరం జడేజా, పంత్ వరుస వికెట్లకు కాస్త బ్రేక్ ఇచ్చి, ఆచితూచి ఆడుతూ స్కోర్‌ను పెంచారు. అయినప్పటికీ… భారీ స్కోర్ సాధించడంలో విఫలమయ్యారు. పంత్ 28, జడేజా 25 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన శార్దూల్ ఠాకూర్(13), మహ్మద్ షమీ (10), కుల్దీప్ యాదవ్ (17) పరుగులు చేశారు. రిచర్డ్‌సన్‌ వేసిన 50వ ఓవర్‌లో తొలి బంతికి షమీ భారీ షాట్‌కు ప్రయత్నించడంతో.. బాల్ నేరుగా కీపర్ చేతికి చెక్కింది. ఫలితంగా టీమిండియా 49.1 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌటైంది.

అనంతరం 256 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కంగారూ టీం ఓపెనర్లే లక్ష్యాన్ని బాదేశారు. ఇన్నింగ్స్ ప్రారంభం నుంచీ భారత బౌలర్లపై ఆధిపత్యం వహిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పరుగుల సునామీ సృష్టించారు. భారత్ నిర్ధేశించిన 256 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోకుండా, కేవలం 37.3 ఓవర్లలోనే సునాయసంగా ముగించింది. ఆస్ట్రేలియా ఓపెనర్స్‌ సెంచరీలతో చేలరేగి ఆడగా… డేవిడ్ వార్నర్ 124 పరుగులు, ఆరోన్ ఫించ్ 110 పరుగులు చేసి, నాటౌట్‌గా నిలిచారు. మ్యాచ్‌ను అలవోకగా విజయ తీరాలకు చేర్చారు. ఆసీస్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు, పాట్ కమిన్స్ రెండు, కేన్ రిచర్డ్సన్ రెండు, ఆడమ్ జంపా, ఆష్టన్ టర్నర్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

స్వదేశంలో వరుస విజయాలతో దూకుడు మీదున్న కోహ్లీసేన… దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, శ్రీలంక, వెస్టిండీస్‌ను ఓడించి జోరుమీదుంది. కానీ, ఆస్ట్రేలియా విషయంలో మాత్రం టీమిండియా దూకుడు కనిపించలేదు. గత సిరీస్‌లో 3-2 తేడాతో ఓడించిన కంగారూలపై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలతో ఉన్న కోహ్లీ… ఆ జట్టుకు కనీస పోటీని ఇవ్వలేకపోయింది. కాగా, మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా వాంఖడే వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మూడు వన్డేల సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ఆధిక్యం సాధించింది.