ఐసీసీ పురస్కారాల్లో దుమ్మురేపిన కోహ్లీ, రోహిత్‌…

ఐసీసీ పురస్కారాల్లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దుమ్మురేపారు. 2019 సంవత్సరానికి గానూ అన్ని ఫార్మాట్లలో, అన్ని విభాగాల్లోనూ ఉత్తమ ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఇందులో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పిరిట్‌ ఆఫ్‌ క్రికెట్‌ అవార్డు, రోహిత్‌ శర్మను.. ఐసీసీ ‘వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌’గా ఎంపికయ్యారు. 2019లో ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో రోహిత్‌ ఐదు సెంచరీలతో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. అలాగే.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డుకు ఎంపిక చేసింది. గత ఏడాది వన్డే ప్రపంచకప్ టోర్నీలో… ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌స్మిత్‌ను అభిమానులు గేలి చేస్తుంటే, బ్యాటింగ్‌ చేస్తున్న కోహ్లీ అడ్డుకున్నాడు. చప్పట్లు కొట్టి ప్రోత్సహించాల్సింది పోయి ఎందుకు అవమానిస్తున్నారంటూ సంజ్ఞలు చేసి.. క్రీడా స్ఫూర్తి చాటాడు. అందుకే అతడిని స్ఫూర్తిదాయక క్రికెటర్‌గా ఐసీసీ ప్రకటించింది. ఇక టెస్టు, వన్డే జట్లకు విరాట్‌ కోహ్లీనే కెప్టెన్ గా ఎంపిక చేయడం విశేషం.

రోహిత్ శర్మ 2019లో 28 వన్డేలు ఆడగా… 57.30 సగటుతో ఏకంగా 1,490 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ముఖ్యంగా.. గత ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ ఏకంగా ఐదు సెంచరీలు చేశాడు. ఇలా ఒకే బ్యాట్స్‌మెన్, ఒక వరల్డ్ కప్‌ టోర్నీలో 5 సెంచరీలు నమోదు చేయడం వరల్డ్‌కప్ చరిత్రలోనే తొలిసారి. గత ఏడాది రోహిత్ శర్మ తర్వాత వన్డేల్లో టాప్ స్కోరర్‌గా కెప్టెన్ విరాట్ కోహ్లీ 1,377 పరుగులతో ఉన్నాడు. అటు.. డబుల్ సెంచరీల వీరుడు మయాంక్‌ అగర్వాల్‌ ఐసీసీ టెస్టు జట్టులో ఓపెనర్‌గా చోటు దక్కించుకున్నాడు. చైనామన్‌ కుల్‌దీప్‌, పేసర్‌ షమి వన్డే జట్టుకు ఎంపికయ్యారు. బంగ్లాదేశ్‌ పై దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌ ఐసీసీ పురుషుల టీ20ల్లో అత్యుత్తమ ప్రదర్శనగా ఎంపికైంది. ఇక, టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ దక్కించుకున్నారు. అంపైర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌ ఎంపికయ్యాడు.